మంత్రి సీతక్క ఇలాకాలో రోడ్ల దుస్థితి.. అంతిమయాత్రకు అవస్థలు

కలం, ములుగు: ములుగు (Mulugu) నియోజకవర్గంలోని ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామంలో రోడ్ల దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో ఓ మృతదేహాన్ని బురదమయమైన దారిలోనే గ్రామస్తులు మోసుకెళ్లాల్సి వచ్చింది. వర్షాలతో దారి మొత్తం చిత్తడిగా మారడంతో మృతదేహాన్ని తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పాడెను మోసుకుంటూ బురదలో అడుగులు వేయడానికి గ్రామస్తులు నానా అవస్థలు పడ్డారు.

బురద రోడ్డుపై మృతదేహం తరలింపు

శ్మశాన వాటికకు వెళ్లే మార్గం అధ్వానంగా ఉండటంతో మృతదేహాన్ని తరలించడం కష్టంగా మారింది. పలుచోట్ల రోడ్డు గుంతలు, బురద ఉండటంతో పాడెను మోసే సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పాడెపై నుంచి మృతదేహం కిందపడే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అంతిమ సంస్కారాల కోసం వెళ్లే దారినైనా సౌకర్యవంతంగా చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

రోడ్డు నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్

ఎలిశెట్టిపల్లి (Elishettipalli) గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని వెంటనే అభివృద్ధి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వర్షాకాలంలో రహదారి మరింత అధ్వానంగా మారి నడిచేందుకు కూడా వీలు లేకుండా పోతోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు గ్రామానికి వచ్చి రహదారి పరిస్థితిని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. శ్మశాన వాటికకు కనీస రహదారి సౌకర్యం కల్పించడంలోనూ నిర్లక్ష్యం చేయడం సరికాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>