కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్క రోజే 6 వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) తెలిపారు. డీజీపీ కార్యాలయంలోని కమాండ్ సెంటర్ నుంచి నిమజ్జనం జరుగుతున్న తీరుని పర్యవేక్షించారు. ఈ సారి 1.24 లక్షల విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు జియో ట్యాగింగ్, పోర్టల్ ద్వారా సమాచారం తెలుస్తోందన్నారు. అయితే, ఇవన్నీ బహిరంగ స్థలాల్లో ఏర్పాటు చేసినవేనని.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే విగ్రహాల సంఖ్య 8 వేలకు పైగా పెరిగాయయన్నారు.
అన్ని జిల్లాల్లో 88 వేల విగ్రహాల నిమజ్జనం..
గత పది రోజుల్లో అన్ని జిల్లాల్లో 88 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారని.. ఇంకా 25,500 విగ్రహాలు పెండింగులో ఉన్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జన ప్రక్రియ శాంతియుతంగా.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతోందని వివరించారు. ఏరియల్ సర్వే ద్వారా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న తీరుని స్వయంగా పరిశీలించామన్నారు. సుమారు 25 వేలకు పైగా పోలీసులను బందోబస్తులో ఉంచామన్నారు. రేపటి ఉదయం నాటికి నగరంలోని మెజార్టీ విగ్రహాల నిమజ్జనం పూర్తవుతుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

