కలం, మహబూబ్ నగర్ బ్యూరో: డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో తరచూ గొడవపడుతూ, కన్న తండ్రిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. మహబూబ్‌నగర్ ఫ్యామిలీ కోర్టు (Mahabubnagar Family Court) కమ్ III అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పి.ఆంజనేయులు శుక్రవారం ఈ సంచలన తీర్పును వెలువరించారు.
రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కవాలి నదేశ్ (అలియాస్ ఆనంద్) అనే వ్యక్తి, నిత్యం డబ్బుల కోసం తన తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే కన్న తండ్రిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి సాధారణ జీవిత ఖైదుతో పాటు రూ. 5,000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే.. 2024 సెప్టెంబర్ 19న రాత్రి సమయంలో రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలో డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన నిందితుడు నదేశ్ (అలియాస్ ఆనంద్) తన తండ్రి కవాలి నారాయణ పై గొడ్డలితో మెడపై పలుమార్లు దాడి చేశాడు. కేకలు విని ఇంట్లోకి వెళ్లిన తల్లి కవాలి చంద్రకళ తన భర్తపై కుమారుడు గొడ్డలితో దాడి చేస్తున్నట్లు గుర్తించింది. తీవ్రంగా గాయపడిన నారాయణను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి మృతి చెందాడు.
మృతుడి భార్య కావాలి చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాపూర్ ఎస్‌ఐ రవి కేసు నమోదు చేసి, జడ్చర్ల రూరల్ సీఐ టి. నాగార్జున గౌడ్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగించి, నిందితుడిపై న్యాయస్థానంలో అభియోగాలు రుజువయ్యే విధంగా ఆధారాలను సమర్పించారు. తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ జీవిస్తుండగా, ఎటువంటి పని పాట లేకుండా ఉన్న నిందితుడు డబ్బుల కోసం వారితో తరచూ గొడవపడేవాడని దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టి.నాగార్జున గౌడ్, కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రవి, APP కె.నరేష్ కుమార్, జె.శ్రీనివాస్, HC-160, ఫ్యామిలీ కోర్టు లైజన్ అధికారి, CDO జె.శేఖర్, PC-2177 తదితరులను జిల్లా ఎస్పీ డి.జానకి, అభినందించారు. నేరాలకు పాల్పడే వ్యక్తులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో పోలీసు శాఖ సమన్వయంతో పనిచేస్తుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

