ఖమ్మం రైతులకు గుడ్ న్యూస్.. అక్టోబర్​ నాటికి బేతుపల్లికి గోదావరి జలాలు!

కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగునీటి సౌకర్యాన్ని మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ముందడుగు వేస్తోంది. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న వివిధ ప్యాకేజీలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, అక్టోబర్ చివరి నాటికి బేతుపల్లి రిజర్వాయరు (Bethupalli Reservoir) కు గోదావరి జలాలను రప్పించేందుకు కసరత్తు వేగవంతమైంది. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య జరిగిన ఉన్నత స్థాయి భేటీలో సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు, భూసేకరణ సమస్యలు, సాగునీటి నెట్‌వర్క్ ఆధునీకరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

​సీతారామ ప్రాజెక్టు (Sitarama Project) పరిధిలోని సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ప్యాకేజీలు-9, 10లలో మిగిలి ఉన్న పనులను అక్టోబర్ చివరి నాటికి వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) అధికారులను ఆదేశించారు. దీనివల్ల అక్టోబరు నెలాఖరు కల్లా గోదావరి జలాలను సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా బేతుపల్లి రిజర్వాయరు (Bethupalli Reservoir) కు తరలించి, స్థానిక రైతులకు సాగునీరు అందించేందుకు మార్గం సుగమం కానుంది. అలాగే ప్యాకేజీలు-11, 12 పనులను మే 2027 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేస్తూ, ఈ ప్యాకేజీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రాధాన్యతా క్రమంలో విడుదల చేస్తామని ఉత్తమ్​ హామీ ఇచ్చారు.

​అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని ప్యాకేజీలు-7, 8లలో పనుల వల్ల రైతులకు జరిగే నష్టాన్ని తగ్గించేందుకు మంత్రి తుమ్మల సరికొత్త ప్రతిపాదనను తెచ్చారు. అక్కడ సంప్రదాయ ఓపెన్ కెనాల్ తీస్తే సుమారు 2,500 ఎకరాల వాణిజ్య, ఆయిల్ పామ్ తోటల భూమిని రైతులు కోల్పోవాల్సి వస్తుందని, అందుకే భూసేకరణ భారాన్ని తగ్గించేందుకు ఓపెన్ కెనాల్ బదులు ‘పైప్‌లైన్ ఇరిగేషన్ నెట్‌వర్క్’ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ ప్రతిపాదనపై స్పందించిన నీటిపారుదల శాఖ మంత్రి, వెంటనే పైప్‌లైన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన సాంకేతిక చర్యలు ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

​మరోవైపు ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గించేందుకు SRLIP కాలువల పరిధిలో అందుబాటులో ఉండే ఖాళీ భూములను వినియోగించుకుని ‘సోలార్ విద్యుత్ ప్లాంట్లను’ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. కాలువలపై ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ను ప్రాజెక్టు పంప్ హౌస్‌లకు ఉపయోగించడం ద్వారా కరెంట్ బిల్లుల భారం తగ్గుతుందని వివరించారు. ఈ ఆలోచనకు మొగ్గు చూపిన నీటిపారుదల శాఖ, వెంటనే కన్సల్టెంట్‌ను పంపి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని వెల్లడించింది.

అంతేకాకుండా జూలూరుపాడు మండలం పాపకొల్లు పరిధిలోని 155 ఎకరాల భూసేకరణ సమస్యలను తక్షణమే పరిష్కరించి, జూలూరుపాడు టన్నెల్ పనులను పట్టాలెక్కించాలని నిర్ణయించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించేందుకు వారంలోపు జూలూరుపాడు ప్రాంతాన్ని వ్యక్తిగతంగా సందర్శించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం, కొత్తగూడెం ఇరిగేషన్ సీఈ ఎస్. శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : ‘చీటింగ్’ ఆరోపణలకు చెక్.. వైడ్‌పై ఆకాశ్ చోప్రా క్లారిటీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>