ఖైరతాబాద్ బైపోల్.. ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు

కలం, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడం, దాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ బైపోల్ అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్‌గా మారింది. సిట్టింగ్ సీటు కావడంతో బీఆర్ఎస్ తప్పనిసరిగా గెలిచి పరువు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌లో చేరినందున దానంపై అనర్హత వేటు పడడంతో.. ఆయనను గెలిపించుకోవడం అధికార పార్టీకి అనివార్యంగా మారింది.

గతంలో ఈ స్థానం నుంచి గెలిచినందున ఇప్పుడు దీటైన అభ్యర్థిని నిలబెట్టి మరోసారి కైవశం చేసుకుంటే సిటీలో పట్టు పెంచుకోవచ్చని బీజేపీ భావిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఖైరతాబాద్ ఉప ఎన్నిక మూడు పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఇక్కడి గెలుపు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. దీని ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపే అవకాశమున్నది.

త్రిముఖ పోరు..

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తప్పనిసరి కావడంతో పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోరుగానే ఉంటుందనే వాదన ఉండగా.. దీన్ని బీజేపీ కూడా సీరియస్‌గా తీసుకుంటుందని, దీంతో త్రిముఖ పోరు తప్పదని మరో వాదనా వినిపిస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం బీజేపీదే అంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం, త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నందున సిటీలో పట్టు పెంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుందని స్థానిక నాయకులు భావిస్తుండడంతో ట్రయాంగిల్ ఫైట్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో దానం నాగేందర్ సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున దానం నాగేందర్ గెలిచారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోడానికి బీఆర్ఎస్, అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉన్నది. ఒకవేళ బీజేపీ కూడా సీరియస్‌గా తీసుకుంటే ఓట్లు చీలి ఎవరికి అనుకూలం అవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.

క్లాస్, మాస్ ఓటర్లు..

ఆసిఫ్‌నగర్ నియోజకవర్గం నుంచి 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత డీలిమిటేషన్ తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2009, 2018, 2023 ఎన్నికల్లో గెలిచారు. ఈ నియోజకవర్గంలో అటు క్లాస్, ఇటు మాస్ ఓటర్లు.. ఇంకోవైపు మజ్లిస్ పార్టీకి తగినంత పట్టు ఉన్న కాలనీలు, బస్తీలు ఉన్నాయి. ఒకవైపు వ్యాపార వర్గాలు, ఐటీ ఉద్యోగులు.. మరోవైపు బస్తీల్లో పేదలు, సెటిలర్లు, మైనారిటీ ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల తరఫున పోటీ చేసిన దానం నాగేందర్‌కు వ్యక్తిగతంగానూ బలమైన ఓటు బ్యాంకే ఉన్నదని ఆయనతో పాటు అనుచరులూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు బలమైన ఓటు బ్యాంకే ఉంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మూడూ పార్టీల మధ్య ఓట్ల తేడా స్వల్పం. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాకు వ్యతిరేకంగా గొంతెత్తారు. కొన్ని బస్తీల్లో ప్రజలు హైడ్రాకు వ్యతిరేకంగా రోడ్డెక్కినప్పుడు దానం నాగేందర్ వారివైపే నిలబడ్డారు. అటు క్లాస్, ఇటు మాస్ ఓటర్లు తనవైపే ఉన్నారని, మళ్లీ పోటీ చేసి గెలుస్తానని, మంత్రినీ అవుతానంటూ హైకోర్టు తీర్పు తర్వాత బహిరంగంగానే ఆయన ప్రకటించారు.

అభ్యర్థులపై ఆసక్తి..

బీఆర్ఎస్ తరఫున సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ పోటీ చేయడం దాదాపుగా ఖరారైందని గులాబీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. అనర్హత వేటు పడినందున తిరిగి దానం నాగేందర్‌నే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న చింతల రామచంద్రారెడ్డిని ఖరారు చేస్తుందా? లేక మరొకరికి అవకాశం ఇస్తుందా? అనే చర్చ బీజేపీలో మొదలైంది.

దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరినందునే అనర్హత వేటు పడడంతో ఆయనకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నది ఆ పార్టీ ఆలోచన. ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ తరఫున పి.జనార్ధన్‌రెడ్డి, ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి గెలవగా.. ఆ తర్వాత వైఎస్సార్ హయాంలో దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ తరఫునే గెలిచారు. ఒకవైపు కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంక్‌, దానం నాగేందర్‌కు వ్యక్తిగతంగా ఈ నియోజకవర్గంలో ఆదరణ ఉండడంతో ఈసారి ఉప ఎన్నికలో గెలుపు సునాయాసమేనన్నది ఆ పార్టీ భావన.

వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్‌ను గెలిపించినందున పార్టీ ఫిరాయింపు అంశంలో దానం నాగేందర్‌కు ఓటర్లు తగిన గుణపాఠం నేర్పుతారన్నది గులాబీ లీడర్ల వాదన. ఈ లెక్కలన్నింటినీ అంచనా వేసుకొని ఏ పార్టీ? ఏ అభ్యర్థిని? నిలబెడుతుందన్నది త్వరలో తేలనున్నది.

సర్‌పై బైపోల్ ఎఫెక్ట్..

ఖైరతాబాద్ బైపోల్‌లో ‘సర్’ ప్రభావం కూడా ఉండనున్నది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,96,036 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం జరుగుతున్న ‘సర్’ ప్రక్రియతో 1.23 లక్షల మంది పేర్లు ముసాయిదా జాబితాలో డిలీట్ అయ్యాయి. సుమారు 42 వేల మంది వివరాలు లేకపోవడంతో ‘అన్‌మ్యాపింగ్’ కేటగిరీలో పడ్డారు. మరో 39 వేల మంది అనామలీ (తేడాలు) కేటగిరీలో ఉన్నారు. సుమారు 81 వేల మందికి ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంతమంది ఓటర్లు అనేది తేలనుంది. తుది జాబితా ఆధారంగానే ఉప ఎన్నిక జరగనున్నది. ఆ జాబితాలో భారీగానే తేడాలుండే అవకాశమున్నది. ఇది ఏ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరం. గత ఎన్నికల్లో 52 శాతమే పోలింగ్ నమోదైంది. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన దానం నాగేందర్.. కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డిపై 22,010 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>