కలం, వెబ్‌డెస్క్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు(AP Local Body Elections) జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ వ్యూహ రచన ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నికలపై ఎవరితో చర్చించేది లేదని తేల్చి చెప్పేసిన పవన్ తాజాగా ఎన్నికల సమన్వయానికి ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించినట్లు ప్రకటించారు. ఈ కమిటీలో చిల్లపల్లి శ్రీనివాసరావు, పెండెం దొరబాబు, వంశీకృష్ణ యాదవ్, పులపర్తి ప్రశాంత్, యనమల భాస్కర్ సభ్యులుగా ఉండనున్నారు. క్షేత్ర స్థాయిలో జనసేన శ్రేణుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు పవన్ కల్యాణ్ ఈ కమిటీ సభ్యులతో కో ఆర్డినేట్ చేసుకోనున్నారు.
గతంలో సైతం జనసేన 14 మంది సభ్యులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. నూతన కమిటీ పాత కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి, అధ్యయనం చేసి పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు నివేదిక సమర్పించనుంది. కమిటీ అందించిన నివేదికల ఆధారంగా పవన్ కల్యాణ్ ప్రతిరోజూ సమీక్ష నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే గతంలో నియమించిన 14 మంది సభ్యుల కమిటీలో కొన్ని మార్పులు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

