మంత్రి జూపల్లి వైఫల్యం వల్లే కల్వకుర్తికి ఈ దుస్థితి : నాగం జనార్ధన్ రెడ్డి

కలం, నాగర్ కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు నీళ్లు అందకపోవడానికి ముమ్మాటికీ మంత్రి జూపల్లి కృష్ణారావే ద్రోహి అని మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి (Nagam Janardhan) మండిపడ్డారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9 మీటర్లు ఉండాల్సిన కాలువల వెడల్పును 7 మీటర్లకు కుదించడం వల్లే నీరు రావడం లేదన్నారు.

నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లలో 4 మోటార్లు పని చేయాల్సి ఉండగా 2 మాత్రమే పని చేస్తున్నాయని, అందుకే రిజర్వాయర్లు నిండడం లేదని ఆరోపించారు. కేవలం 3 టీఎంసీల నీటి కోసం హెలికాప్టర్ లో కర్ణాటక వెళ్లడం దారుణమని, ముందే ప్రణాళికతో రిజర్వాయర్లు నింపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. 8 గంటల విద్యుత్ తో పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి సాగు, తాగునీటి ఎద్దడి లేకుండా చేశామని గుర్తు చేశారు.

వెంటనే మోటార్లు సరిచేసి, నార్లాపూర్-ఏదుల మధ్య మట్టి దిబ్బను తొలగించి రిజర్వాయర్లు నింపాలని, లేకుంటే తాగునీటి ఎద్దడి తప్పదని నాగం జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. అలాగే అవినీతికి పాల్పడేందుకే ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించారా? అని నిలదీశారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కంటే గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మేలన్నారు. ఈ సమావేశంలో నాయకులు బాలా గౌడ్, రవి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>