కలం, ఖమ్మం బ్యూరో: కరెంట్ షాక్‌తో తొమ్మిది నెలల బాలుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం (Khammam) జిల్లాలోని కొణిజర్ల మండలం చిన్నమునగాలలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నమునగాలకు చెందిన ఇల్లెందుల మమత, రమేష్ దంపతులకు తొమ్మిది నెలల కుమారుడు అవేద్ ఉన్నాడు. గురువారం సాయంత్రం వేళ బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎర్త్ పైపు వద్ద ఉన్న స్టీల్ ప్లేట్‌లోకి విద్యుత్ ప్రసారమైంది. చిన్నారి అవేద్ ఆడుకుంటూ వెళ్లి ఆ స్టీల్ ప్లేట్‌ను పట్టుకున్నాడు.
దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై బాలుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అయితే, బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే ఆడుతూ పాడుతూ తిరిగిన పసిపాప అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో చిన్నమునగాల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

