కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగాయి. విశ్వహిందూ పరిషత్, హిందూ ఉత్సవ సమితి, కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రసిద్ధ టవర్ సర్కిల్(Tower Circle) వద్ద నిమజ్జన వేడుకలను నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొలువైన గణనాథుల ప్రతిమలు భారీ శోభాయాత్రల మధ్య టవర్ సర్కిల్‌కు చేరుకున్నాయి. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు కుల, మతాలకు అతీతంగా ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఐక్యతను చాటుతున్నాయని అన్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుడిని కడసారి దర్శించుకోవడం సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

భక్తులు, యువజన సంఘాలు సమన్వయంతో వ్యవహరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు కరీంనగర్ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టవర్ సర్కిల్ ప్రాంతం ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో మార్మోగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>