కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) మున్సిపాలిటీ పరిధిలోని 27 డివిజన్లకు చెందిన అర్హులైన పేదలకు 360 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల (Double Bedroom Houses) కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా పూర్తయింది. గురువారం పెద్దమ్మతల్లి ఆలయ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, మేయర్ మూడ్ గణేష్ సమక్షంలో చిన్నారుల ద్వారా లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు.
మొత్తం 360 ఇళ్లకు గాను 4,611 దరఖాస్తులు రాగా, విచారణ అనంతరం 1,254 మందిని అర్హులుగా గుర్తించారు. దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ నిబంధనలు, రిజర్వేషన్లకు అనుగుణంగా ఎస్సీ (61), ఎస్టీ (22), మైనారిటీ (43), బీసీ/ఓసీ (234) కేటగిరీల్లో ఇళ్లను కేటాయించారు. వీటిలో మొత్తంగా 18 ఇళ్లను దివ్యాంగులకు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే తమ లక్ష్యమని, గతంలో ఇళ్లు వస్తాయని ఇండ్లు ఖాళీ చేసి ఇప్పుడు జాబితాలో పేర్లు లేనివారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ధ్రువపత్రాల పరిశీలన తర్వాతే తుది ఉత్తర్వులు ఇస్తామని, ఇళ్ల పేరుతో డబ్బులు అడిగే దళారులను నమ్మవద్దని సూచించారు. లక్కీ డ్రాలో ఇల్లు రానివారు నిరుత్సాహపడొద్దని, భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని మేయర్ తెలిపారు. అనంతరం ఎంపికైన లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలను అందజేశారు.

