కలం, కాజీపేట: హనుమకొండ జిల్లా కాజీపేట (Kazipet) పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం దారుణ హత్య (Murder) ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ (Diesel Colony) బాలాజీనగర్‌లో ఉదయశ్రీ (40) అనే మహిళ హత్యకు గురైంది. ఆమెను కుమారుడు దొరబాబు (20) హత్య చేసినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనకు కుటుంబ విభేదాలే కారణమా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయశ్రీకి ఓ వ్యక్తితో ఉన్న సంబంధం విషయంలో తల్లి, కుమారుడి మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఈ విషయమై దొరబాబు తల్లిని పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇంటి మేడపై తల్లితో వాగ్వాదానికి దిగి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఉదయశ్రీ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాజీపేట పోలీసులు బాలాజీనగర్‌కు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, స్థానికులను విచారిస్తూ హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

