కలం, భువనగిరి: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో థర్మల్ పవర్ ప్లాంట్లు, సింగరేణి (Singareni) గనుల పేరుతో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్లలో కమీషన్లు దండుకున్న బీఆర్‌ఎస్ నేతలు, ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ల వద్దకు వెళ్లి ధర్నాల పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ శాఖలో జరిగిన దోపిడీకి నాటి మంత్రి జగదీష్ రెడ్డియే ప్రధాన కారణమని ఆరోపించారు.
12 గంటల కరెంట్ కూడా ఇవ్వలే..
బీఆర్‌ఎస్ పాలనలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయకుండా నిర్వీర్యం చేశారని చామల (MP Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సదరు ప్లాంట్‌ను పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాగైతే కుప్పకూల్చారో, థర్మల్ పవర్ ప్లాంట్ల పరిస్థితిని కూడా అలాగే తయారు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో రైతులకు పన్నెండు గంటల విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వలేదని, నాటి లాగ్ బుక్కులు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుందన్నారు.
కొత్త గనులు వచ్చేలా చర్యలు..
సింగరేణి గనుల ప్రైవేటీకరణ బీఆర్‌ఎస్ ఘనతే సింగరేణిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి 18 గనులు మూతపడేలా చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని చామల విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలకులు సింగరేణికి ఏకంగా రూ.35 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, కొత్త గనులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న బొగ్గులో దాదాపు 90% (40 లక్షల మెట్రిక్ టన్నుల్లో 36 లక్షల మెట్రిక్ టన్నులు) తెలంగాణ విద్యుత్ అవసరాలకే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎకరం నీళ్లు పారని కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.1.5 లక్షల కోట్లు వృథా చేశారని, కార్పొరేషన్ల పేరుతో ఇష్టం వచ్చినట్లు రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. వారు చేసిన అప్పులకు గాను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.8,000 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. నాయకులు తమ ఫామ్‌హౌస్‌ల నిర్మాణాలపై పెట్టిన శ్రద్ధ రాష్ట్ర ప్రగతిపై పెట్టలేదని ఎద్దేవా చేశారు.
ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్..
ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కు అని, కేటీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరని చామల (MP Chamala) అన్నారు. బషీర్‌బాగ్ కాల్పుల సమయంలో కేసీఆర్ చంద్రబాబుతోనే ఉన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో వర్షాలు పడక కరువు రావాలని, ప్రజలు కాంగ్రెస్‌పై కోపంతో ఉంటే తాను సీఎం కావచ్చు అని కేటీఆర్ నిత్యం మొక్కులు మొక్కుతున్నారని, కానీ ఆయన కలలు ఎప్పటికీ నెరవేరవని స్పష్టం చేశారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గౌరవిస్తుందని, ప్రతి సందర్భంలోనూ కోర్టుల జోక్యం ఆహ్వానించదగినదేనని తెలిపారు.
ఎన్నికలకు తమ పార్టీ ఎప్పుడూ భయపడదని, గతంలో జూబ్లీహిల్స్‌తో సహా హైదరాబాద్‌లో జరిగిన రెండు ఉపఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌నే గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేళ్ల కాలపరిమితితో స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని, అధికారం పోయి వెయ్యి రోజులు కాకముందే మళ్లీ సీఎం పీఠం ఎక్కాలని కేటీఆర్ ఆరాటపడితే సాధ్యం కాదని హితవు పలికారు.
Also Read : సుప్రీం కోర్టు తీర్పు.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

