సూపర్ ఎల్ నినో.. నాలుగున్నర లక్షల ప్రాణాలకు ముప్పు

కలం, సెంట్రల్ డెస్క్: ప్రపంచం ఎప్పుడూ చూడని, అత్యంత ప్రమాదకరమైన ‘సూపర్ ఎల్ నినో (Super El Nino)’ దూసుకొస్తున్నది. యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ శాస్త్రవేత్తలు బుధవారం విడుదల చేసిన ఓ నివేదిక ఆందోళన కలిస్తున్నది. ఈ నివేదిక ప్రకారం.. సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది హీట్-వేవ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా 2027 మధ్యకాలం వరకు భూ ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదవుతాయని పరిశోధకులు స్పష్టం చేశారు.

భారత్‌కూ పెను ముప్పు..

సెప్టెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 మధ్యకాలంలోనే ప్రపంచవ్యాప్తంగా 2.39 లక్షల మంది వేడి వాతావరణం వల్ల మరణించవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఇందులో అత్యధిక మరణాలు గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న) దేశాల్లోనే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అత్యధిక ఉష్ణోగ్రత మరణాల ముప్పున్న దేశాల జాబితాలో నైజీరియా, సూడాన్, ఇండోనేషియాల తర్వాత భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది. కేవలం భారత్లోనే ఈ సూపర్ ఎల్ నినో కారణంగా అదనంగా 15,800 మంది మరణించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

చలికాలంలోనూ సెగలు..

సాధారణంగా ఎల్ నినో ప్రభావం వేసవిలో ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ, భారత్, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాలలో ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు, మరణాల తీవ్రత.. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి (చలికాలం) మధ్యకాలంలోనే ఎక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. రాబోయే రెండు దశాబ్దాల్లో భూగోళం ఎదుర్కోబోయే తీవ్రమైన వాతావరణ మార్పులకు (గ్లోబల్ వార్మింగ్) ఈ ప్రస్తుత ఎల్ నినో ఒక ‘ముందస్తు హెచ్చరిక’ లాంటిదని శాస్త్రవేత్తలు అభివర్ణించారు. దీని నుంచి ప్రజలను రక్షించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రత్యేక హీట్ యాక్షన్ ప్లాన్లు, వలస కార్మికులకు పని వేళల మార్పులు వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>