కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ఉత్సవాల వేళ (Ganesh immersion) శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళల భద్రతకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నిమజ్జనం ఉత్సవాల్లో అభ్యంతరకర రీతిలో రీల్స్ చేస్తూ, వాహనాలపై ప్రమాదకర విన్యాసాలకు పాల్పడిన ఘటనలపై సోషల్ మీడియా వేదికగా నిఘా పెట్టి ఇన్స్టాగ్రామ్ వీడియోల ఆధారంగా నాలుగు వేర్వేరు కేసులు నమోదు చేశారు. నిమజ్జన ఊరేగింపుల్లో ఇతరులకు ప్రమాదం కలిగించేలా ప్రవర్తించిన నలుగురిపై కేసులు బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఉత్సవాల సందర్భంగా మహిళల భద్రత లక్ష్యంగా షీ టీమ్స్ పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ఖైరతాబాద్, బాలాపూర్ తో పాటు ప్రధాన నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ బలగాలను భారీగా మోహరించారు. ఈవ్ టీజింగ్, వేధింపులు, ఇతర అవాంఛనీయ చర్యలను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల సందర్భంగా వేధింపులు, ఈవ్ టీజింగ్ కేసులకు సంబంధించి మొత్తం 1,530 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా వీరిలో 724 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి, తగిన హెచ్చరికల అనంతరం వారిని వదిలిపెట్టారు. ఉత్సవాలు ముగిసే వరకు నిఘా కొనసాగుతుందని, మహిళల రక్షణ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

