విఘ్నేశ్వరుడికి తప్పని నీటి విఘ్నాలు.. మిర్యాలగూడలో కరువు కష్టాలు!

కలం, మిర్యాలగూడ: ఏటా వినాయక చవితి వేడుకలంటే ఊరూ వాడా దండోరాలే. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న ఆ విఘ్ననాయకుడు, ముగింపులో కన్నులపండువగా సాగే నిమజ్జన శోభాయాత్ర ద్వారా గంగమ్మ ఒడికి చేరుకోవడం ఆనవాయితీ. కానీ, ఈ ఏడాది తెలంగాణను చుట్టుముట్టిన కరువు పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. మనుషులకు, పంటలకే కాదు, చివరికి ఆ విఘ్నాధిపతికి కూడా నీటి తిప్పలు తప్పడం లేదు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda) పరిసర ప్రాంతాల్లో వెలుగుచూసిన దృశ్యాలు భక్తులను తీవ్ర అసహనానికి, ఆవేదనకు గురిచేస్తున్నాయి.

కృష్ణమ్మ కోసం ఎదురుచూపులు..

భక్తిశ్రద్ధలతో, బాణసంచా కాలుస్తూ చెరువుల వద్దకు చేరుకున్న భక్తులకు అక్కడ తీవ్ర నిరాశే ఎదురైంది. వర్షాభావం కారణంగా చెరువులు, కాలువల్లో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. దాంతో విగ్రహాలను నీటిలో వదిలినా.. అవి మునిగేంత లోతు నీరు లేక వేసిన చోటే తేలుతూ ఒడ్డునే మిగిలిపోతున్నాయి. నిమజ్జనం చేసిన విగ్రహాలు సరిగ్గా మునగకపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భక్తితో సాగనంపాలనుకున్న దేవుడి విగ్రహాలు నీటిపైన అలా తెలియాడుతుండటం గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వేములపల్లి సమీపంలో దృశ్యాలు ఇంకా కరుణాజనకంగా ఉన్నాయి. కృష్ణా నది నుంచి నీరు వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న నీటి కాలువలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దాంతో కృష్ణమ్మ రాక కోసం బొజ్జ గణనాథుడే స్వయంగా ఎదురుచూడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.

కరువు తీవ్రతకు అద్దం పడుతున్న విఘ్నేశ్వరుడు

ఈ ఘటన కేవలం ఒక పండుగ ముగింపు సమస్య మాత్రమే కాదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నెలకొన్న తీవ్రమైన కరువు పరిస్థితులకు ప్రతీకగా నిలుస్తోంది. వానలు పడక, కాలువలకు నీళ్లు రాక ఎండిపోతున్న చెరువులు ఎంతటి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయో ఈ వినాయక నిమజ్జనాలే ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాయి. భక్తులు కొందరు చేసేదేమీ లేక అరకొర నీటిలోనే అరకొరగా నిమజ్జనం చేసి బరువెక్కిన హృదయాలతో వెనుతిరుగుతుండగా.. మరికొందరు కాస్త లోతు ఉన్న మడుగులను వెతుక్కుంటూ దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విఘ్ననాశకుడే తెలంగాణ పై కరుణ చూపి త్వరలోనే వర్షాలు కురిపించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

ఇదిలావుంటే.. ‘ఏటా ఎంతో వైభవంగా కాలువల్లో ఉప్పొంగే నీటిలో నిమజ్జనం చేసేవాళ్లం. ఈసారి చెరువుల్లో మోకాళ్ల లోతు నీళ్లు కూడా లేవు. స్వామివారిని నీటిలో వదిలితే విగ్రహాలు మునగకుండా అలాగే తేలుతున్నాయి. దేవుడికే ఈ పరిస్థితి వస్తే.. ఇక రైతుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు’ అని వేములపల్లికి చెందిన ఒక భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>