కలం, జోగులాంబ గద్వాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద రేవులపల్లి, బీంపురం గ్రామాలకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గత వారం రోజుల నుంచి పంటలు ఎండి పోతుండడంతో సాగు నీరందించాలని కోరినా.. తెలంగాణ ప్రభుత్వం, అధికారులు ఏమాత్రం కనికరించడం లేదని రైతులు ఆరోపించారు.
రైతులు పంటల కోసం రోడెక్కి ధర్నాలు చేపడుతుంటే అధికారులు స్పందించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు నీళ్లు విడుదల చేస్తామని చెప్పి 48 గంటలు గడిచినా కూడా కనికరం చూపెట్టడం లేదన్నారు. సాగు చేసిన పంటలకు సాగు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని, రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జూరాల కుడి కాలువకు సాగు నీరందించాలని రైతులు డిమాండ్ చేశారు.

