కలం, ఖమ్మం బ్యూరో : “డాక్టర్ జగదీష్ నాకు తమ్ముడి లాంటివాడు. నిన్నటి వరకు సరదాగా ఉన్న వ్యక్తి ఇంత చిన్న వయస్సులోనే దేవుడి వద్దకు వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నాను” అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్ అకాల మరణం పట్ల ఆయన దిగ్భ్రాంతి చెందారు. ఆయన మృతి తనకు, మమతా విద్యా సంస్థలకు, ఖమ్మం ప్రజలకు తీరని లోటని అన్నారు.
2012 నుంచి మమతా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న జగదీష్, న్యూరో విభాగం బలోపేతానికి, పేదలకు ఉచిత వైద్యం అందించడానికి ఎంతో కృషి చేశారని పువ్వాడ కొనియాడారు. ఐఎంఏ సెక్రటరీగా, ప్రెసిడెంట్‌గా ఆయన అందించిన సేవలు మరవలేనివన్నారు. ఒంగోలు నుండి వచ్చిన జగదీష్ భార్య, పిల్లలను పరామర్శించిన పువ్వాడ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

