పెళ్లైన 3 నెలలకే వధువు ఆత్మహత్య..!

​కలం, ఖమ్మం బ్యూరో : కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి వివాహ బంధం మూన్నాళ్ల ముచ్చటైంది. పెళ్లై పట్టుమని మూడు నెలలు కూడా గడవకముందే 20 ఏళ్ల నవవధువు దారుణంగా శవమై తేలింది. భర్త అనుమానపు ప్రవర్తన, దానికి అత్తమామల ప్రోత్సాహం తోడవడంతో తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడిందన్న వార్త స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఖమ్మం (Khammam) రమణగుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

స్థానికుల వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన పెనుగొండ నాగలీల, రామకృష్ణ దంపతుల కుమార్తె నాగలక్ష్మి(20)కి ఖమ్మం (Khammam) రమణగుట్టకు చెందిన గుంజి నాగార్జున(26)తో ఈ ఏడాది జులై 8న వివాహమైంది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న నాగార్జున, పెళ్లయిన నాటి నుంచే తన భార్య నాగలక్ష్మిపై అనుమానం పెంచుకుని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. కుమారుడిని వారించాల్సిన అత్త గుంజి నాగమణి, మామ నాగేశ్వరరావు కూడా అతడికే మద్దతుగా నిలుస్తూ వేధింపులకు సహకరించారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందులను నాగలక్ష్మి పలుమార్లు తల్లికి చెప్పుకుని బాధపడగా, కాలక్రమేణా సంసారం సర్దుకుంటుందనే ఉద్దేశంతో తల్లి నాగలీల నచ్చజెబుతూ వచ్చింది.

​అత్తింటివారి నుంచి రోజురోజుకూ పెరుగుతున్న వేధింపులను భరించలేకపోయిన నాగలక్ష్మి, ఆదివారం ఇంట్లోని పైగదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేవలం 73 రోజుల వ్యవధిలోనే నవవధువు ప్రాణాలు కోల్పోవడంతో మృతురాలి స్వగ్రామంలోను, కుటుంబంలోనూ తీవ్ర విషాదం అలముకుంది. తమ కుమార్తె మృతికి కారణమైన భర్త నాగార్జునతో పాటు అత్త నాగమణి, మామ నాగేశ్వరరావులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని నాగలక్ష్మి తల్లి నాగలీల పోలీసులను ఆశ్రయించగా, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>