కలం, ఖమ్మం బ్యూరో : “ఖమ్మంలో పేదల ఇళ్లకు రక్షణ కల్పించి, కోర్టు ఆదేశాల ప్రకారం వారం రోజుల్లో నివేదిక ఇచ్చి నిరుపేదలకు న్యాయం చేయాలని అధికారులను, న్యాయస్థానాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను” అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) విజ్ఞప్తి చేశారు. ఆదివారం బాధితులను పరామర్శించిన అనంతరం పువ్వాడ మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ లోపంతోనే వెలుగుమట్ల, శ్రీనివాసనగర్‌లలో పేదలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను అర్ధరాత్రి వేళ దారుణంగా కూల్చివేశారని మండిపడ్డారు. పేదల పక్షాన బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి జీవో 58 ద్వారా దాదాపు 3,000 మందికి, శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లో 696 మందికి క్రమబద్ధీకరణ పట్టాలు అందించామని గుర్తుచేశారు. అధికారులు పాత కోర్టు ఆర్డర్ ఆధారంగా కూల్చివేతలు జరుపుతుంటే, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు రవీందర్, నిరోషలు కోర్టులో ఈ జీవో 58 పట్టాల గురించి ప్రస్తావించి పేదల తరఫున నిలిచారని తెలిపారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి పేదల గూడుకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్‌జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, లీగల్ సెల్ ప్రతినిధులు నిరోషా, లెలిన్ తదితరులు పాల్గొన్నారు.

