కలం, నల్లగొండ: కనగల్ మండలం చిన్న మాధారం (Chinnamadharam) సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు, గోల్మాల్ జరిగాయని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy) ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన రీకౌంటింగ్‌లో ఓట్ల లెక్కల్లో తేడాలు కనిపించాయని, దీనిపై ఎన్నికల అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ముగిసిన రోజున అధికారులు అధికారికంగా లెక్కించిన ఓట్లు 1,401 కాగా, కోర్టు ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన రీకౌంటింగ్‌లో 1,409 ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. అదనంగా వచ్చిన 8 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయో అధికారులు వెల్లడించాలని కోరారు.
అదేవిధంగా పోలింగ్ రోజున 16 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా, రీకౌంటింగ్ సమయంలో కేవలం 6 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. మిగతా 10 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కడికి వెళ్లాయో ఎన్నికల అధికారులు తక్షణమే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఓట్ చోరీ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారని, మరి చిన్న మాధారంలో జరిగిన ఈ ఓట్ల లెక్కల తేడాను ఏమనాలని ఆయన ప్రశ్నించారు. ఈ అవకతవకల వెనుక అధికార పార్టీ ప్రమేయం ఉందనే సమాచారం తమ వద్ద ఉందని ఆరోపించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సవాల్ విసిరిన వర్షిత్ రెడ్డి.. ఎన్నికల అవకతవకలతో తనకు, తన వర్గానికి ఎలాంటి సంబంధం లేదని దేవుడి ముందు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. తాను కూడా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థికి అన్యాయం జరిగిందని, ఓట్ల లెక్కల్లో తేడాలే దీనికి నిదర్శనమని వర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థికి పూర్తి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పిండి పాపిరెడ్డి, పాలకూరి రవి గౌడ్, పరసనబోయిన భిక్షం, పులకరం భిక్షం, కాలం విజయేందర్ రెడ్డి, కొత్త లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

