కలం, కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన స్వచ్ఛ రిక్షాల(Swachh Rickshaws) పంపిణీలో భారీ అవినీతి జరిగిందని తెలంగాణ రక్షణ సేన (TRS) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా పంపిణీ చేసిన ఈ రిక్షాలు ప్రారంభానికి ముందే నాణ్యత లోపాలతో మరమ్మతులకు గురికావడం అధికారుల నిర్లక్ష్యానికి, అవినీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. కొన్ని రిక్షాలకు పంపిణీకి ముందే టైర్లు, ట్యూబులు, తాళాలు, నడిచేందుకు అవసరమైన చైన్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. అధికారుల ఒత్తిడితో పేద కార్మికులు తమ సొంత డబ్బులు ఖర్చు చేసి రిక్షాలకు మరమ్మతులు చేయించుకున్న అనంతరం వాటిని ప్రారంభోత్సవానికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన వాహనాల మరమ్మతుల భారాన్ని కార్మికులపై మోపడం ఎంతవరకు సమంజసమని హరిప్రసాద్ ప్రశ్నించారు.
బీజేపీ పాలనలో అవినీతి లేదని చెబుతున్న కేంద్ర మంత్రి.. నాణ్యత లేని రిక్షాల పంపిణీ వెనుక కారణాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నాణ్యమైన పరికరాలు అందించాల్సిన బాధ్యత నగర పాలక సంస్థపై ఉందన్నారు. స్వచ్ఛ రిక్షాల కొనుగోళ్లపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కార్మికులు తమ సొంతంగా చేసిన మరమ్మతుల ఖర్చులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సంబంధిత దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసి ఆందోళన చేపడతామని హరిప్రసాద్ హెచ్చరించారు.

