కలం, గోదావరిఖని: గోదావరిఖని (Godavarikhani) వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ, ఈర్ష్య కారణంగా యువతికి పురుగుల మందు బలవంతంగా తాగించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో కాంట్రాక్ట్ అధ్యాపకుడు జెట్టి నవీన్ కుమార్ (38) (A-1), సింగరేణి ఓవర్‌మన్ బొమ్మకంటి రవికుమార్ (35) (A-2)ను అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారు, రెండు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. 2022లో యువతి పాలిటెక్నిక్ చదువుతున్న సమయంలో కాంట్రాక్ట్ అధ్యాపకుడు నవీన్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం మైనింగ్ శిక్షణ కోసం ఆమె గోదావరిఖనికి వచ్చిన సమయంలో సింగరేణి ఓవర్‌మన్ రవికుమార్‌తో సన్నిహితంగా ఉండటాన్ని నవీన్ కుమార్ తట్టుకోలేకపోయాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.ఈ నెల 12న సాయంత్రం యువతిని కారులో ఎక్కించుకున్న నవీన్ కుమార్.. రవికుమార్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బలవంతంగా సూసైడ్ నోట్ రాయించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నీళ్ల సీసాలో తీసుకువచ్చిన పురుగుల మందును ఆమెతో బలవంతంగా తాగించినట్లు పేర్కొన్నారు.
పురుగుల మందు తాగిన అనంతరం యువతి స్పృహ కోల్పోయినప్పటికీ ఆసుపత్రికి వెంటనే తరలించకుండా కారులోనే తిప్పుతూ జాప్యం చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఆత్మహత్యగా నమ్మించేందుకు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, వారితో ఆసుపత్రికి తీసుకెళ్లించి అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు యువతి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రవికుమార్‌పై వచ్చిన శారీరక వేధింపుల ఆరోపణలు, సింగరేణి అధికారుల నిర్లక్ష్యంపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

