కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజలు ఆశీర్వదిస్తే కేసీఆర్తో సహా మోదీ, రేవంత్ రెడ్డి మీద కొట్లాడుతానంటూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రకటించారు. ఎవరి మద్దతు లేకుండా ఒక మహిళ రాజకీయంగా ఎలా ఎదుగుతుందనేది తాను నిరూపిస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే మహిళ ముఖ్యమంత్రి ఉన్నారని.. ప్రజలు తనకు మద్దతు పలికితే తెలంగాణలోనూ మాతృస్వామ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. తాను బహుజనుల బాణాన్ని, యువకుల యుద్ధ నినాదాన్ని అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. బహుజనుల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే అంటూ తేల్చి చెప్పారు. ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు.
ఉద్యోగాలు ఎందుకు రాలేదు..?
ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డితో కలిసి 2009లో టీడీపీతో పొత్తులో భాగంగా కోస్గికి వచ్చానని కవిత గుర్తు చేసుకున్నారు. కోస్గి, కొడంగల్, తెలంగాణ ప్రజల దీవెనలతో తాను కూడా రాష్ట్రాన్ని నడిపిస్తాననే విశ్వాసంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉండగా ఇంకో పార్టీ ఎందుకంటూ అక్కాచెల్లెళ్లు ఆలోచన చేస్తున్నారని.. కానీ ఆయా పార్టీలతో బతుకులు ఏమైనా మారాయా? అంటూ ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు రాకపోతే ఆంధ్రోళ్ల కారణంగానే రాలేదని భావించామని.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకు రాలేదన్నారు. ఇప్పటికీ తల్లితండ్రులు ఇచ్చే డబ్బుతోనే యువత ఏదైనా చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అందుకే ఈ తంగెడు పువ్వు రంగు జెండాతో మీ ముందుకు వచ్చి ఆశీర్వాదం కోరుతున్నట్లు కవిత తెలిపారు.
ఉచితంగా వైద్యం..
టీఆర్ఎస్ పార్టీ అయిదు ప్రధాన అంశాలతో పాంచజన్యం అనే పేరు పెట్టుకుందకి కల్వకుంట్ల కవిత తెలిపారు. సమాజంలో ఆధర్మం పెరిగినప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం ఊది పోరాటం చేయాలని చెబుతాడని.. అందుకే పాంచజన్యం పేరుతో ప్రజల కోసం పోరాటం చేయాలని భావిస్తున్నానని వివరించారు. తెలంగాణలో విద్యా రంగం పరిస్థితి దారుణంగా తయారైందని, గురుకుల్లాలో ఫుడ్ పాజయిన్ అవుతున్న పట్టించుకునే నాథుడు లేరన్నారు. పాలిటెక్నిక్ విద్య తీసేసి, విదేశాలకు వెళ్లి కూలీ పనిచేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే వైద్యం ఉచితంగా అందిస్తామని.. రూపాయి ఖర్చు లేకుండా ఆ భారమంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి యువతను నమ్మొద్దు అంటున్నాడని.. ఆయన బూతులను నమ్మాలా? అంటూ ప్రశ్నించారు.
నీళ్లు ఇవ్వకపోతే పేరు మార్చుకుంటా..
మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నది పారుతున్నా ఇక్కడ ప్రజలకు నీళ్లు రావటం లేదంటే.. పాలకుల చేతకానితనానికి నిదర్శనమని కవిత ఆరోపించారు. గతంలో అంటే ఆంధ్రోడి పాలన అని అనుకున్నామని.. 12 ఏళ్లు అయినా సరే ఎందుకు రాలేదన్నారు. జూరాల నుంచి రోజుకు 3 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉందని, అయినా ముఖ్యమంత్రి ఎందుకు ఆ దిశగా ఆలోచించడం చేయడం లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఇబ్రహీం పట్నం వరకు పది లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తామని.. లేకపోతే నా పేరు మార్చుకుంటానని కవిత శపథం చేశారు. ఈ ముఖ్యమంత్రి బలవంతుడనని వీర్రవీగుతున్నాడని.. చలి చీమల చేతిలో బలవంతమైన సర్పం చనిపోయినట్లు ఆయనకు పరాభవం తప్పదన్నారు.
లంబాడాలకు చోటు ఏదీ..?
ముదిరాజ్, ముస్లింలు, నేతన్నలు, గీతన్నల జనాభాకు అనుగుణంగా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం ఉండాల్సిందే అని కవిత అన్నారు. మాదిగ, మాల సోదరులకు కూడా వారికి సమాజంలో గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్లలో ముఖ్యమంత్రి లంబాడీ ఆడబిడ్డలపై సాగించిన దాష్టీకం అన్యాయం కాదా?.. లంబాడాలకు మంత్రులుగా అవకాశం ఇవ్వని మొదటి ప్రభుత్వం ఇదేనన్నారు.
తాను కాంగ్రెస్ వదిలిన బాణాన్ని అని బీఆర్ఎస్ అంటోందని.. ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ల ఆస్తుల లెక్కను నాతో కలిపి చెప్పినప్పుడు నేను బీఆర్ఎస్ వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటున్నారని కవిత ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని, మహబూబ్ నగర్ ప్రజలు నిలదీయాలన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 13 సీట్లు ఇస్తే ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, ఇందిరమ్మ ఇళ్ల దందా చేస్తున్నారని కవిత ఆరోపించారు.

