కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజల శాంతి భద్రతలు కాపాడటం,శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం లక్ష్యంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar Ganesh Immersion) జిల్లా పోలీసు శాఖ పలు ముందస్తు చర్యలు చేపడుతోంది. సుప్రీంకోర్టు తీర్పులు, ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో గణేష్ నిమజ్జనం ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టం వినియోగానికి ఎటువంటి అనుమతి ఇవ్వబడదని ఎస్పీ జానకి (SP Janaki) స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇతరులకు తీవ్ర శబ్ద కాలుష్యం కలిగించడం అనుమతించరాదని స్పష్టం చేసిందని తెలిపారు.
పోలీస్ శాఖకు సహకరించాలి..
ఈ నేపథ్యంలో గణేష్ ఉత్సవాల నిర్వాహకులు, డీజే ఆపరేటర్లు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. అనుమతి లేకుండా డీజే వినియోగించడం, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించడం లేదా పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించడం జరిగితే సంబంధిత నిర్వాహకులు, డీజే ఆపరేటర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు, గణేష్ ఉత్సవాల నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించి, నిబంధనలను పాటించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ప్రజల ఆరోగ్యం కూడా మనందరి బాధ్యత..
అధిక శబ్దం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, ఇతర సున్నిత వర్గాల ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. గణేష్ నిమజ్జన వేడుకల సమయంలో అధిక శబ్దం, డ్యాన్స్ , భారీ జనసమ్మర్థంతో ఆరోగ్య సమస్యలు తలెత్తిన ఘటనలు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయని చెప్పారు. అందువల్ల వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా పోలీసు శాఖ సూచిస్తోందని వివరించారు.
నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు..
1. పోలీసుల సూచించిన నిమజ్జన మార్గం. సమయాలను తప్పనిసరిగా పాటించాలి.
2. ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసుకోవాలి.
3. విద్యుత్ వైర్లు, ట్రాఫిక్, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
4. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
5. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.
6. అనుమతి లేని డీజేలు, అధిక శబ్దాన్ని కలిగించే సౌండ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయకూడదు.
7. ఏదైనా అనుమానాస్పద వ్యక్తి, వస్తువు, అవాంఛనీయ పరిస్థితి కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు, జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ 8712659360 లేదా 112కి సమాచారం అందించాలి.

