కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండపూర్, కరివెన తదితర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. భూసేకరణ, కాలువల నిర్మాణం తదితర పనులను పూర్తి చేసి ప్రాజెక్టులను నిర్ణీత కాలవ్యవధిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఆదివారం దేవరకద్ర నియోజకవర్గంలో హ్యామ్ రోడ్లు, ముచ్చింతల బ్రిడ్జి పనులకు మంత్రి కోమటిరెడ్డి మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కురుమూర్తి స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్దండపూర్ ప్రాజెక్టు భూసేకరణకు రూ.560 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కరివెన రిజర్వాయర్ కాలువల పనులను కూడా వేగవంతం చేసి వచ్చే ఏడాదిలోగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు.
రూ.183 కోట్లతో హ్యామ్ రోడ్లు..
దేవరకద్ర నియోజకవర్గంలో సుమారు రూ.183 కోట్లతో 12 గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేలా హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.13 వేల కోట్ల విలువైన రోడ్ల పనులకు టెండర్లు పిలిచామని, 6 వేల కిలోమీటర్లకు పైగా రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కురుమూర్తి దేవస్థానం ఘాట్ రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని తెలిపారు.
రూ.2,600 కోట్లతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధి చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. దేవరకద్రతో పాటు మక్తల్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతాల్లో మంజూరైన రోడ్డు పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మూడు మండలాల్లో మండల సమీకృత కార్యాలయ సముదాయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. వచ్చే వారం టెండర్లు పిలిచి, నవంబర్‌లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జూరాల నీటిని కాపాడుకోవాలి: మంత్రి శ్రీహరి
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు నీటిని ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పశువులు, ప్రజల అవసరాలకు నీటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి నీటి వనరులను భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని శ్రీహరి పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు.

