కలం, నల్లగొండ: కృష్ణా నదిలో నీటి లభ్యత ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పంట పొలాలు ఎండిపోతున్నాయని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఆరోపించారు. రైతుల పట్ల ప్రభుత్వం నేరపూరిత వైఖరిని అవలంబిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం తెలకంటి గూడెం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ధైర్యం చెప్పారు.
అనంతరం పొలాల సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి లాగ్‌బుక్‌ను పరిశీలించారు. విద్యుత్ సరఫరా తీరుపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. కృష్ణా నదికి నీరు వచ్చినప్పటికీ పంటలను ఎందుకు ఎండబెడుతున్నారో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు సమాధానం చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నీరు, విద్యుత్ కొరతతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలించాలని సూచించారు. నీటిని వినియోగించుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న నేపథ్యంలో ఎండిపోయిన పంటలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
గతంలో ‘ఎల్‌నినో’ పేరుతో ప్రభుత్వం నాటకాలు ఆడిందని, ఇప్పుడు బొగ్గు కొరతను సాకుగా చూపుతూ విద్యుత్ కోతలు విధిస్తోందని విమర్శించారు. రాజకీయాల కోసం మాట్లాడుతున్నామని భావించే వారు నేరుగా ఎండిపోయిన పంట పొలాల వద్దకు వచ్చి రైతుల బాధలు వినాలని సూచించారు. గతంలో కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పంటలు సాగు చేయలేకపోయామని, కేసీఆర్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌తో పాటు సరిపడా సాగునీరు అందడంతో సమృద్ధిగా పంటలు పండించుకున్నామని రైతులు చెబుతున్నారని అన్నారు. గతంలో 21 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేసీఆర్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించిందని తెలిపారు.
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు నీళ్లు లేవని, మరోవైపు బొగ్గు లేదని కారణాలు చెబుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మిల్లర్లను భయపెట్టి మిల్లులు బంద్ చేయిస్తున్నారని విమర్శించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఎండిపోయిన పంటలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే రైతులను ఇబ్బందులకు గురిచేయడమేనా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సరిపడా సాగునీటితో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్‌ఎస్ (BRS) పార్టీ తరఫున రైతుల పక్షాన పెద్దఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.

