ఎర్రవల్లి శుద్ధీకరణపై ప్రజాజాగృతికి పాదయాత్ర: కవ్వంపల్లి

కలం, కరీంనగర్ బ్యూరో: ఎర్రవల్లి శుద్ధీకరణ ఘటనపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు దళితుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్లు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) తెలిపారు. ఆదివారం ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాదయాత్రకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. దళితుల పట్ల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా..

ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైందని భావించిన అంటరానితనం వంటి ఘటనలు తెలంగాణలోనూ చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఇలాంటి ఘటనలపై దళితులు, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎర్రవల్లి శుద్ధీకరణ ఘటన దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న పాదయాత్రలో ప్రతి పల్లె, ప్రతి దళితవాడకు వెళ్లి ఎర్రవల్లి ఘటనను ప్రజలకు వివరించి సామాజిక చైతన్యం కల్పిస్తామని తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన పూర్తి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని డాక్టర్ కవ్వంపల్లి వెల్లడించారు.

నెలాఖరులోగా పూర్తి చేయాలి..

ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, ఇతర స్థాయిల్లో ఎస్సీ సెల్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని డాక్టర్ కవ్వంపల్లి ఆదేశించారు. కమిటీల ఏర్పాటులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కమిటీల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా అధ్యక్షులకు స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా కమిటీలను ఏర్పాటు చేయని పక్షంలో సంబంధిత జిల్లా అధ్యక్షులను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>