కలం, వెబ్ డెస్క్ : సిద్దిపేట జిల్లాలో వెలుగుచూసిన క్యూ నెట్ ఫ్రాడ్ (QNET Fraud) కేసు కలకలం రేపుతోంది. ఈ బహుళ స్థాయి మార్కెటింగ్ (MLM) స్కామ్‌లో రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయిన వేలూరుకు చెందిన హరికృష్ణ అనే యువకుడు, అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్‌లో క్యూ నెట్ సంస్థ చేసిన మోసమే కారణమని పేర్కొన్నాడు.
బాధితుడి తండ్రి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొలుత కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు, కేసు తీవ్రతను బట్టి దీనిని సీఐడీ CIDకి బదిలీ చేశారు. అయితే, క్యూ నెట్, దాని అనుబంధ సంస్థ విహన్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్గనైజేషన్ల భారీ మోసాలు, అంతర్రాష్ట్ర ముఠాల పాత్ర వెలుగులోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సమగ్ర విచారణ కోసం సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు క్యూ నెట్, విహన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల డైరెక్టర్లతో సహా మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

