కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగర శివారు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ ఏటీఎమ్ (Karimnagar ATM Robbery) చోరీ కలకలం సృష్టించింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఒక గ్యాంగ్, ఏటీఎమ్ సెంటర్లలోకి చొరబడి గ్యాస్ కట్టర్ల సహాయంతో యంత్రాలను కట్ చేసి అందులోని భారీ నగదును ఎత్తుకెళ్లింది.
ఒకే సారి.. రెండు ఏటీఎమ్‌లలో చోరీ
పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎమ్ వద్దకు ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:35 గంటల ప్రాంతంలో దుండగులు ఒక తెల్లటి ‘స్కార్పియో’ వాహనంలో వచ్చారు. ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు వేగంగా ఏటీఎమ్‌లోకి ప్రవేశించారు. అదే సమయంలో, ఎల్ఎండీ (LMD) పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ ఎస్బీఐ ఏటీఎమ్‌లో కూడా సరిగ్గా ఇదే తరహాలో చోరీ జరిగింది.
పక్కా స్కెచ్ తో దోపిడి
ఈ దోపిడీ విధానాన్ని పరిశీలిస్తే అంతర్రాష్ట్ర దొంగల ముఠా పక్కా ప్రణాళికతోనే వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. ఏటీఎమ్‌లోకి ప్రవేశించిన వెంటనే దొంగలు ముందుగా లోపల ఉన్న సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి దృశ్యాలు కనిపించకుండా చేశారు. ఆ తర్వాత అలారం సిస్టమ్‌తో పాటు, సీసీ కెమెరాలకు సంబంధించిన ప్రధాన కేబుళ్లను కట్ చేశారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లను ఉపయోగించి ఏటీఎమ్ మిషన్‌ను క్షణాల్లో కట్ చేసి, లోపల ఉంచిన క్యాష్ బాక్సులోని నగదును ఎత్తుకెళ్లారు. అయితే ముఠాలో ఒకరు లేడీ గెటప్ లో వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది.
కేవలం 8 నిమిషాల్లోనే పని పూర్తి!
దుర్షేడు ఏటీఎమ్ సెంటర్‌లో ప్రవేశించిన దొంగల ముఠా, వాహనాన్ని బయట పార్క్ చేసి లోపలికి వెళ్లి కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే చోరీకి పాల్పడి పరారైనట్లు ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
10 నిమిషాలకు ఢిల్లీ నుంచి సమాచారం..
ఏటీఎమ్ అలారం సిస్టమ్ తెగిపోవడంతో చోరీ జరిగిన 10 నిమిషాలకు ఢిల్లీలోని ఎస్బీఐ సెంట్రల్ సెక్యూరిటీ రూమ్ నుంచి స్థానిక పోలీసులకు హెచ్చరికలు అందాయి. పోలీసు బృందాలు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకునే సరికే దుండగులు అక్కడ నుండి సేఫ్‌గా పరారయ్యారు. అలారం మోగడంలో సాంకేతిక లోపం జరిగిందా? లేక అప్రమత్తంగా ఉండాల్సిన సెక్యూరిటీ బృందం స్పందించడంలో ఆలస్యం జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గణపతి నవరాత్రుల వేళ పక్కా రెక్కీ?
ప్రస్తుతం వినాయక నవరాత్రుల ఉత్సవాలు జరుగుతుండటంతో మండపాల వద్ద అర్థరాత్రి వరకు భక్తులు, జనం రద్దీ ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని తెల్లవారుజామున రద్దీ తగ్గే సమయంలో చోరీకి అనువైన సమయంగా ఎంచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. దుర్షేడు, తిమ్మాపూర్ చోరీలు ఒకే ముఠా చేసిందా? లేక రెండు బృందాలుగా విడిపోయి ఒకే సమయంలో ఈ దాడులకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాలను క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.

