ఆలేరు గులాబీ దళంలో ‘ఇద్దరి’ పోరు!

కలం, నల్లగొండ బ్యూరో: బీఆర్ఎస్‌ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో తగ్గిపోగా ఆదరణను తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నించాల్సిన పార్టీ లీడర్లే.. తమ పట్టు కోసం పంతాలకు పోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆలేరు (Alair BRS) అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్ కు చేరింది. ఎంతగా అంటే.. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్యగౌడ్‌ మధ్య నువ్వా.. నేనా.. అన్నట్టుగా వర్గపోరు మారింది. నియోజకవర్గంపై తమ పట్టు ఎక్కడ కోల్పోతామోననే భయంతో ఇటు సునీత.. అటు భిక్షమయ్యగౌడ్‌ తమ సొంత అజెండాలతో ముందుకు కెళ్తుండడంతో కేడర్లో అయోమయం నెలకొంది.

ఎవరికీ వారే అన్నట్టుగా..

కొన్నాళ్లుగా నియోజకవర్గంలో బూడిద వర్సెస్ గొంగిడి అనేట్టుగా మారింది. తమ పట్టును నిలబెట్టుకునేందుకు బల ప్రదర్శనలకు దిగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినా.. ప్రజా సమస్యలపై స్పందించాల్సి వచ్చినా.. ఎవరికి వారే ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇరువురు నేతలు వేర్వేరుగా నిరసనలు చేయడం కామన్ గా మారింది.

క్షేత్రస్థాయిలో కేడర్ ను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన లీడర్లే తన్నుకునే పరిస్థితి కన్పిస్తుండడంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో గొంగిడి సునీత భువనగిరి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహిస్తే.. బూడిద భిక్షమయ్యగౌడ్ ఆలేరులో ప్రెస్ మీట్ పెట్టడంతో కార్యకర్తలు తీవ్ర గందరగోళంలోకి వెళ్లారు.

ప్రొటోకాల్‌కు స్వస్తి..

బీఆర్ఎస్ నుంచి గొంగిడి సునీత రెండుసార్లు ఆలేరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందే కాంగ్రెస్ నుంచి బూడిద భిక్షమయ్యగౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు.
అనంతరం కొన్నికారణాలతో ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా.. గత అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్‌కు అడ్డాగా ఆలేరు ఉండగా.. సునీత ఓటమి తర్వాత పరిస్థితి తారుమారైంది.

దీనికితోడు ఆలేరులో బీసీలు సైతం ఎక్కువగా ఉండడంతో భిక్షమయ్యగౌడ్ ఎమ్మెల్యే టికెట్ రేసులోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ కన్‌ఫర్మ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని చర్చ జరుగుతోంది. దీనిపై గొంగిడి సునీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడమే కాకుండా పార్టీ అధికారిక కార్యక్రమాలకు కూడా భిక్షమయ్య గౌడ్‌ను పిలవడం లేదు. ఆఖరుకి ప్లెక్సీల్లోనూ ఆయన ఫొటోను పెట్టడం లేదు. సునీత ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు భిక్షమయ్యగౌడ్ డుమ్మా కొడుతున్నారు.

వేదికలపైనే తిట్లకు దిగుతూ..

ప్రస్తుతం ఆలేరు బీఆర్ఎస్ లో నెలకొన్న వర్గ పోరు కాస్త భిక్షమయ్య గౌడ్, సునీత ఒకరిపై మరొకరు తిట్ల దండకాలకు దిగుతున్న స్థాయికి చేరింది.
ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పార్టీలో ఉంటూనే తనను ఓడించేందుకు భిక్షమయ్యగౌడ్ ప్రయత్నించారని సునీత ఆరోపించారు. ఆయన సైతం ఆమెపై ఆరోపణలు చేసిన సందర్భాలు లేకపోలేదు.

ఒకే నియోజకవర్గంలో ఉంటూనే ఉప్పు.. నిప్పులా వ్యవహరిస్తుంటే.. కేడర్ తలలు పట్టుకుంటోంది. ఇదే అదునుగా కాంగ్రెస్ మరోసారి ఆలేరు అసెంబ్లీని తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>