కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం రూపుదిద్దుకుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతంలో 21న వాయుగుండంగా, 22న తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు ఈ నెల 23 లేదా 24 నాటికి తుఫాన్‌గా మారే సూచనలున్నాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో సంభవిస్తున్న వేగవంతమైన మార్పుల కారణంగా నేడు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (AP Heavy Rain) పడతాయని అంచనా వేసింది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. సముద్ర తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులకు అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వేట కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే సురక్షితమైన తీర ప్రాంతాలకు తిరిగి రావాలని హెచ్చరించారు.

