సాంకేతికతతో లాభసాటిగా వ్యవసాయం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

కలం, నాగర్ కర్నూల్: రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను అందిపుచ్చుకుని అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ (Hemanth Keshav Patil) సూచించారు. శనివారం పాలెంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళా, రైతు–శాస్త్రవేత్తల సమావేశం, వ్యవసాయ ప్రదర్శనను రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు ఏవీఎన్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర పరికరాలు, పంటల సంరక్షణ పద్ధతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అధికంగా ఎరువులు వాడితే..

రైతులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ.. భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సాగుకు ముందు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకొని భూసారానికి అనుగుణంగా ఎరువులను వినియోగించాలని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రబీ సీజన్‌లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వలన సాగు ఖర్చులు పెరగడంతో పాటు నేల సారవంతత దెబ్బతినే అవకాశం ఉందన్నారు.

మార్కెటింగ్ కూడా ముఖ్యం..

రైతులు కేవలం పంటల ఉత్పత్తిపైనే కాకుండా నాణ్యత, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలపై కూడా దృష్టి సారించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం, రైతు సమూహాలుగా ఏర్పడి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అందించే సాంకేతిక సలహాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంటల సాగులో ఎదురయ్యే సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి శాస్త్రీయ పరిష్కారాలు పొందాలని సూచించారు.

సబ్సిడీ ఉపయోగించుకోవాలి..

రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సబ్సిడీని అందిపుచ్చుకొని లాభదాయకమైన వ్యవసాయానికి బదిలీ కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కిసాన్ మేళాలో రైతులు సాగులో సమస్యలను శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లారు. తెగుళ్లు, చీడపీడల నివారణ, ఎరువుల వినియోగం, అధిక దిగుబడుల సాధన, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక తదితర అంశాలపై శాస్త్రవేత్తలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ కృష్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జ్ఞానశేఖర్, జిల్లా భూగర్భ జల అధికారిణి దివ్యజ్యోతి, అడిషనల్ డీఆర్‌డీఓ రాజేశ్వరి, కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ శైలజ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>