కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్వర్యంలోని పంచాయతీ రాజ్ శాఖ ఒక ఆసక్తికరమైన జీవోను విడుదల చేసింది. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనుల నిమిత్తం కేవలం రెండు రూపాయలతో ఈ ఉత్తర్వులు జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆన్లైన్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో తలెత్తిన ఒక సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకే నిపుణుల సూచన మేరకు ఈ రెండు రూపాయల జీవోను జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
కేంద్ర ప్రాయోజిత పథకం అయిన ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్) కింద గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ పథకం కింద వ్యయాన్ని భరించేందుకు గాను, ఆన్లైన్ వ్యవస్థలోని సాంకేతిక అడ్డంకిని తొలగించడానికి అదనపు నిధులుగా ఈ రెండు రూపాయల పరిపాలనా అనుమతిని మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది.

