NH-563 నిర్మాణానికి పొన్నం ప్రభాకర్ పోరాటమే పునాది: మంత్రి కార్యాలయం

కలం, కరీంనగర్ బ్యూరో: ​ఉత్తర తెలంగాణ ప్రాంత రవాణా విప్లవంలో మైలురాయిగా నిలిచిన జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (NH-563) నిర్మాణం, నాడు ఎంపీగా పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చూపిన ముందుచూపు, చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితమేనని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

​పార్లమెంట్ సాక్షిగా నాటి పోరాటం

పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనే ఈ ప్రాంత రవాణా కష్టాలను తీర్చేందుకు వరంగల్ – కరీంనగర్ – జగిత్యాల మార్గాన్ని జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. నిరంతరం కేంద్రానికి లేఖలు రాస్తూ, లోక్‌సభలో బలంగా స్వరం వినిపించారు.

2016లోనే కేంద్రం నుంచి అధికారిక లేఖ

పొన్నం ప్రభాకర్ కృషికి స్పందిస్తూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ నాటి కార్యదర్శి సంజయ్ మిత్ర 2016 మే 24న అధికారికంగా లేఖ రాశారు. 2014 మార్చిలోనే ఈ మార్గాన్ని NH-563గా గుర్తించామని, సుమారు 130 కిలోమీటర్ల మేర 4-లేన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు పనులను NHAIకి అప్పగించినట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు.

​అందుబాటులోకి వచ్చిన వరంగల్ – కరీంనగర్ హైవే

నాడు నాటిన విత్తనమే నేడు వటవృక్షమై, వరంగల్ – కరీంనగర్ మధ్య 4-లేన్ల రహదారి నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రాంతీయ ఆర్థిక రంగానికి కొత్త ఊపిరి పోసింది.

​జగిత్యాల మార్గంపై ప్రత్యేక దృష్టి

మిగిలి ఉన్న కరీంనగర్ – జగిత్యాల రహదారి పనులకు ఉన్న సాంకేతిక, ఇతర అడ్డంకులను తొలగించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ఈ భాగాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ​నాడు ఎంపీగా పొన్నం ప్రభాకర్ వేసిన పునాదే నేడు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి రహదారిగా మారిందని, ‘నాటి పోరాటమే నేటి ప్రగతి’ అనడానికి NH-563 సజీవ సాక్ష్యమని మంత్రి కార్యాలయం ఆ ప్రకటనలో వివరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>