కలం, ఆదిలాబాద్: ప్రత్యేక బలహీన తెగల (పీవీటీజీ) గ్రామాల్లోని గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ సేవలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ (Adilabad Collector) రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీవీటీజీ ఆవాసాల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేక పలువురికి ఆధార్ జారీలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు అధికారులు వివరించడంతో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఏయే గ్రామాల్లో ఆదివాసీలకు జనన ధ్రువీకరణ పత్రాలు లేవో గుర్తించి, వెంటనే వాటిని జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
జనన ధ్రువీకరణ పత్రాలు అందిన వెంటనే ఆయా గ్రామాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆధార్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోస్టల్ శాఖ పరిధిలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ‘బాల్ ఆధార్’ ప్రక్రియను చేపట్టి, ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాంక్, ఈడీఎం సమన్వయంతో బాల ఆధార్ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

