కలం, మామడ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమాన్ని మామడ మండలం దిమ్మదుర్తి (Dimmadurthy) గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, ఆధునికంగా మారుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

