‘మా ఆస్తులు రాసిచ్చేస్తాం’.. సీఎంకు కేటీఆర్ సవాల్

కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ కుటుంబానికి రూ.లక్ష కోట్ల విలువైన భూములు ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. తమకున్న ఆస్తులన్నీ రాసిచ్చేస్తామని.. రూ.లక్ష కోట్లను తెలంగాణలోని పేద ప్రజల ఖాతాల్లో జమ చేయాలని సవాల్ విసురుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

‘సీఎం రేవంత్.. నువ్వు చేసే ఆరోపణల్లో ఒక్కటి నిజం లేకపోయినా.. ఓ ఆఫర్ ఇస్తున్నా. పేద ప్రజల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరు మీద ఉన్న ఇంచు భూమి కూడా వదలకుండా రాసిస్తాం. లేకపోతే పిచ్చి ప్రచారం ఇకనైనా మానుకుని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు. వెయ్యి ఎకరాల ఫాంహౌస్ అంటూ చేసిన విష ప్రచారం బెడిసి కొట్టడంతో ఇప్పుడు రూ.లక్ష కోట్ల భూములు అంటూ విష ప్రచారం చేసేందుకు సిగ్గుగా లేదా..?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

నువ్వే ఒప్పుకున్నావ్..

కేసీఆర్ ఫాంహౌస్ కేవలం 67 ఎకరాలని సీఎం రేవంత్ రెడ్డినే స్వయంగా అసెంబ్లీలో ఒప్పుకున్నాక.. మళ్లీ కట్టుకథలు ఎందుకు అల్లుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వెయ్యి రోజుల పాలనా వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నట్లు సమాజానికి అర్థమైపోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కుంభకోణం అని ప్రచారం చేసి ఒక్క రూపాయి అవినీతి నిరూపించలేదు. ఇప్పుడు, కేసీఆర్ కుటుంబానికి రూ.లక్ష కోట్ల ఆస్తులంటూ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారనుకోవడం నీ అవివేకం. కేసీఆర జీవితం తెరిచిన పుస్తకం. తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి, నాలుగు కోట్ల మంది ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఆయన’ అన్నారు.

అవీనితి, అక్రమాలు బయటకు తీస్తాం..

పవిత్రమైన అసెంబ్లీలో అసత్యాలు చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి క్షమించరాని తప్పిదం చేశారని కేటీఆర్ విమర్శించారు. ’22ఏ కింద కోటి 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టడం వెనుకే అసలైన రూ.లక్ష కోట్ల కుంభకోణం దాగి ఉంది. అక్రమ దందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డదారిలో అందలం ఎక్కిన నీకు.. దోచుకోవడం, కుంభకోణాలు చేయడం తప్ప పాలన రాదని జనాలకు అర్థమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మీ అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు బయటపెడుతాం. దోచుకున్న ప్రతీ పైసాను తెలంగాణ ప్రజల సాక్షిగా కక్కిస్తాం’ అని కేటీఆర్ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>