కలం, మెదక్ బ్యూరో: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ (KCR Farmhouse) శివారు భూముల్లో రెవెన్యూ, సర్వే అధికారులు వరుసగా రెండో రోజు క్షేత్రస్థాయి విచారణ, సర్వే చేశారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, ఏడీ సుదర్శన్, మర్కూక్ ఎమ్మార్వో నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. తొలిరోజు గురువారం ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరదరాజ్ పూర్ గ్రామాల సరిహద్దుల పరిధిలోని భూములను అధికారులు పరిశీలించి ప్రాథమిక మార్కింగ్ పూర్తి చేశారు. వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న 325 సర్వే నంబర్‌లోని 388 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
శుక్రవారం 325 సర్వే నంబర్ పరిధిలో అసలు ఎంత విస్తీర్ణంలో భూమి ఉందో ఖచ్చితంగా తేల్చేందుకు శాటిలైట్ సర్వే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వ భూములు ఎంతవరకు ఉన్నాయి? అందులో పట్టా భూములు ఎంతమేరకు ఆక్రమణలకు గురయ్యాయి? లాంటి వివరాలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. మొత్తం 5 బృందాలుగా విడిపోయి 325 సర్వే నంబర్ లోని 388 ఎకరాల భూములు సర్వే చేశారు. భూముల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. గూగుల్ ఎర్త్‌లోని పాత శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తూ వాస్తవాలేంటో బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు మర్కూక్ తహసీల్దార్ కార్యాలయంలోని పాత ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్న ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజ్‌పూర్ గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లు, భూముల రికార్డులను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములు, పట్టా భూముల పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే: హరీశ్ రావు
రాష్ట్రంలో ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, అందులో భాగమే తన వ్యవసాయ భూమి వద్దకు కాంగ్రెస్ ఎంపీల పర్యటన అని హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. తన వ్యవసాయ భూమిపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. తనకు విలాసవంతమైన ఫామ్‌హౌస్ గానీ, కనీసం బాత్రూం కూడా లేదని స్పష్టం చేశారు.

