కలం, నిర్మల్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై (Danam Nagender) అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (MLA Alleti) తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టడం ప్రజాస్వామ్యానికి కీలకమైన తీర్పుగా భావిస్తున్నామని అన్నారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలకు ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ అంశంపై శనివారం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు తెలిపారు.

