కలం, సూర్యాపేట: 22A రిజిస్ట్రేషన్ల నిరోధిత జాబితాలోని భూముల వివాదం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించుకోలేరని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy) అన్నారు. శుక్రవారం సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 22A భూముల అంశంపై అసెంబ్లీలో నేరుగా చర్చకు అవకాశం కల్పించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చర్చ జరపడం సరికాదని అన్నారు. అవకాశం ఇస్తే ఈ అంశంపై తమ పార్టీ వాదనను అసెంబ్లీలో బలంగా వినిపిస్తామని పేర్కొన్నారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసర భూముల సర్వే విషయంలో ప్రభుత్వానికి దళితుల నుంచి ప్రతిఘటన ఎదురైందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఫామ్‌హౌస్ పరిసరాలలో చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. హైలెవెల్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో విలువైన భూముల విషయంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగదీష్ రెడ్డి అన్నారు. భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు.
నాగార్జునసాగర్ నీటిపై అభ్యంతరం
ఎల్‌నినో ప్రభావం పేరుతో నాగార్జునసాగర్ నీటిని ఆంధ్రప్రదేశ్ వైపు తరలిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. సాగర్ ఎడమ కాలువ కింద రైతులకు నీరు అందకుండా ఖమ్మం జిల్లా వైరా వైపు నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. తూములు మూసివేయాలని ఈఎన్సీ నుంచి ఉత్తర్వులు రావడంపై జగదీష్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒక్క ఎకరం పంట ఎండిపోయినా బాధ్యత సంబంధిత మంత్రులదేనని పేర్కొన్నారు. రైతుల పంటలను కాపాడేందుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం భూ సమస్యలు, సాగునీటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

