కలం, స్పోర్ట్స్: భారత క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే బాధ్యతను బోర్డు నిర్వాహకులకు అప్పగించింది. ముంబైలోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం 95వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాత బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా, బెంగాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, జార్ఖండ్ కార్యదర్శి సౌరభ్ తివారీ పాల్గొన్నారు.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా అరుణ్ సింగ్ ధుమాల్, మజుందార్‌లు తిరిగి ఎన్నికయ్యారని శుక్లా తెలిపారు. సెలక్షన్ కమిటీ భవిష్యత్తును నిర్ణయించే అధికారాన్ని బోర్డు నిర్వాహకులకు అప్పగించినట్లు ఆయన స్పష్టం చేశారు. అగార్కర్ 2023 జూలైలో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన కాంట్రాక్ట్ వచ్చే నెలతో ముగియనుంది. కాంట్రాక్ట్ పొడిగించకపోతే కొత్త అధ్యక్షుడి ఎంపికకు సమయం పడుతుంది. బోర్డు ప్రకటన ఇచ్చి, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయాల్సి ఉంటుంది.
కాంట్రాక్ట్ పొడిగింపు లేకపోతే అగార్కర్ స్థానంలో మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ బలమైన పోటీదారుగా రేసులో ఉన్నారు. ఒకవేళ పార్థివ్ పటేల్ ఎంపికైతే ప్రస్తుత కమిటీలో అత్యధికంగా 25 టెస్టులు ఆడిన అనుభవజ్ఞుడిగా నిలుస్తారు. ప్రస్తుతం కమిటీలో ఎస్.ఎస్. దాస్, ఆర్.పి. సింగ్, ప్రజ్ఞాన్ ఓజో, అజయ్ రాత్రా ఉన్నారు.
ఈ కమిటీ ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగే హోమ్ సిరీస్‌కు జట్టును ప్రకటించింది. అక్టోబర్, నవంబర్‌లలో జరిగే న్యూజిలాండ్ పర్యటనకు భారత్, భారత్ ‘ఎ’ జట్లను ఎంపిక చేయడమే వీరి తదుపరి ప్రధాన బాధ్యత. భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. దీనికి ముందే భారత ‘ఎ’ జట్టు మూడు అనధికారిక టెస్టుల్లో పాల్గొంటుంది.

