కలం, కరీంనగర్ బ్యూరో: అప్పుగా తీసుకున్న రూ. 25 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి చేతిలో పురుగుల మందు డబ్బాతో బిఎస్ఎన్ఎల్ (BSNL) సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో శుక్రవారం కలకలం రేపింది.
బాధితుడి వాదన ప్రకారం..
గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన అరుకుట్టి కొమరయ్య అనే వ్యక్తికి, గంగాధర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత భర్త జాగిరపు శ్రీనివాసరెడ్డికి మధ్య గత కొన్ని ఏళ్లుగా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. కొమరయ్య వద్ద నుంచి శ్రీనివాసరెడ్డి రూ. 25 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, గత ఆరు సంవత్సరాలుగా ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా శ్రీనివాసరెడ్డి తనను తీవ్రంగా సతాయరిస్తున్నాడని, చుట్టూ తిప్పుకుంటున్నాడని కొమరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టినా ఫలితం లేకుండా పోయిందని తెలిపాడు.
టవర్‌పై తీవ్ర ఉద్రిక్తత..
న్యాయం జరగడం లేదన్న తీవ్ర మనస్తాపంతో కొమరయ్య శుక్రవారం చేతిలో పురుగుల మందు (మందు డబ్బా) పట్టుకుని కురిక్యాలలోని సెల్ టవర్ పైకి ఎక్కాడు. శ్రీనివాసరెడ్డి నుంచి తన రూ. 25 లక్షలు వెంటనే ఇప్పించాలని, లేకపోతే టవర్ పైనుంచి దూకి లేదా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
రంగంలోకి పోలీసులు..
స్థానికులు వెంటనే గంగాధర పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానిక నాయకులు కొమరయ్యతో ఫోన్ ద్వారా, మైక్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించారు. శ్రీనివాసరెడ్డితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని, కిందకు దిగాలని హామీ ఇచ్చారు. గంటల తరబడి సాగిన డ్రామా అనంతరం, పోలీసులు సున్నితంగా నచ్చజెప్పి కొమరయ్యను కిందకు దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

