రోడ్డు భద్రతపై పటిష్ట చర్యలు చేపట్టాలి : కలెక్టర్ ప్రియాంక

కలం, నారాయణపేట : రోడ్డు భద్రత (Road Safety) పై పటిష్టమైన చర్యలు చేపట్టి, సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన రోడ్డు భద్రత సమావేశంలో కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) మాట్లాడుతూ…జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అవసరమైన సైనేజీలు, రోడ్డు భద్రతా సూచికలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.

ముఖ్యంగా పాఠశాలల పరిసర ప్రాంతాలను పరిశీలించి, విద్యార్థుల భద్రతకు అవసరమైన చోట అదనపు సైనేజీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్‌అండ్‌బీ, పోలీస్, మున్సిపల్, గ్రామపంచాయతీ తదితర శాఖలు తమ పరిధిలోని రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదాలకు కారణమయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు, రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ తదితర భద్రతా చర్యలను ప్రతిపాదించి అమలు చేయాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి, వాటికి సంబంధించిన వివరాలను తదుపరి సమీక్షా సమావేశానికి సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు.

నిధులు అందుబాటులోకి వచ్చిన వెంటనే రోడ్డు భద్రతకు సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందేలా అంబులెన్స్, లైఫ్ సపోర్ట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. 108 అంబులెన్స్ సేవలపై సమగ్రంగా సమీక్షించి, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న అంబులెన్స్‌ల సంఖ్య, వాటి సేవల లభ్యత, 24 గంటల అత్యవసర సేవల పరిస్థితి, ప్రమాద ప్రాంతాలకు చేరుకునే మార్గాలు తదితర అంశాలపై స్పష్టమైన వివరాలతో తదుపరి సమావేశానికి ప్రెజెంటేషన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఎన్‌హెచ్‌ అధికారులతో సమన్వయం చేసి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు, అత్యవసర వైద్య సహాయక వ్యవస్థ, అంబులెన్స్ రూట్ ప్లాన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. రాబోయే గణేష్ నిమజ్జనం కార్యక్రమాల నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీస్, మున్సిపల్, గ్రామపంచాయతీ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.

నారాయణపేట(Narayanpet ) మున్సిపల్ పరిధిలో రోడ్లకు అడ్డుగా ఉన్న చెట్లు, కొమ్మలను గుర్తించి అవసరమైన మేరకు తొలగింపు/కొమ్మల కత్తిరింపు చర్యలు చేపట్టాలని తెలిపారు. పూర్తిగా చెట్లను తొలగించకుండా, అవసరమైన మేరకు కొమ్మలను మాత్రమే కత్తిరించాలని సూచించారు. ప్రతి శాఖ తమ పరిధిలో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలు, తీసుకున్న చర్యలు, ప్రస్తుతం చేపడుతున్న పనులు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. తదుపరి రోడ్డు భద్రత సమీక్షా సమావేశాన్ని అక్టోబర్ మొదటి వారంలో, 14వ తేదీ లోపు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.

సమావేశానికి కేవలం వివరాలతో కాకుండా శాఖల వారీగా చేపట్టిన పనులు, పురోగతి, తదుపరి కార్యాచరణపై స్పష్టమైన ప్రెజెంటేషన్లతో అధికారులు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్అండ్‌బీ ఈఈ వెంకట రమణయ్య, ఆర్టీవో మెంబర్ పోషల్ రాజేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, ఆర్టీవో మున్నీ, సీఐ శివశంకర్, మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్, ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ కృష్ణ చైతన్య, నేషనల్ హైవే అధికారి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>