కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ విచారణాస్త్రం.. తేలేదెంత?

కలం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌(KCR)కు ఉన్న సాగు భూముల విస్తీర్ణమెంత? ఎర్రవల్లి గ్రామంలోని ఆయన ఫామ్‌హౌస్‌ ఎన్ని ఎకరాల్లో ఉంది? ఈ భూములను ఆయన ఎప్పుడు కొనుగోలు చేశారు?.. ఇవన్నీ ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నలు. ఆ ఫామ్‌హౌస్‌ను దగ్గరి నుంచి చూసే అవకాశం కూడా చాలా మందికి లేదు. దీంతో దీనిపై ఎప్పటి నుంచో ఎన్నో అనుమానాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కేసీఆర్ ఫామ్‌హౌస్ దాదాపు 700 ఎకరాల్లో ఉన్నదని సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఇందులో సుమారు 388 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నదని ఆరోపించారు. ఆ భూముల లెక్క తేల్చాలని విచారణకు ఆదేశించారు.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కేసీఆర్‌కు 2004, 2009 లోక్‌సభ ఎన్నికల నాటికి ఒక్క ఎకరం కూడా భూమి లేదు. కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఎన్నికల అఫిడవిట్లలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పేర్కొన్నారు. కానీ తాజాగా ముగిసిన 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం కుటుంబ స్థిరాస్తులు (హిందూ యునైటెడ్ ఫ్యామిలీ) 53.30 ఎకరాలు ఉన్నట్లుగా చూపారు.

2010–2014 మధ్య కేసీఆర్ కొనుగోలు చేసిన భూముల వివరాలు

2010 నుంచి 2014 మధ్య కేసీఆర్ ఎర్రవల్లి ప్రాంతంలో పలు విడతల్లో భూములను కొనుగోలు చేసినట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. ఈ వివరాల ప్రకారం, 2010 సెప్టెంబర్ 21న 5.35 ఎకరాలు, సెప్టెంబర్ 22న 15.30 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అనంతరం 2013 ఏప్రిల్ 26న 2.10 ఎకరాలు, అక్టోబర్ 18న 14 ఎకరాలు, అక్టోబర్ 25న 1.04 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు వివరాల్లో ఉంది. 2014లో మే 19న 4.02 ఎకరాలు, జూన్ 30న 0.20 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ వివరాల ప్రకారం, 2010–2014 మధ్య ఎర్రవల్లి ప్రాంతంలో మొత్తం 42.01 ఎకరాల భూమిని ఏడు విడతల్లో కొనుగోలు చేసినట్లు లెక్కలు సూచిస్తున్నాయి.

కేసీఆర్‌కు చెందిన మెజారిటీ సాగు భూములు ఎర్రవల్లి గ్రామంలోనే ఉన్నాయి. ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్న 17 రకాల స్థిరాస్తి జాబితాలో ఒక్కటి మినహా మిగిలినవన్నీ ఎర్రవల్లి గ్రామంలోనివే. శివారు వెంకటాపూర్ గ్రామంలో 10 ఎకరాల భూమి ఉన్నది. 2004 నాటికి ఒక్క ఎకరం కూడా సాగు భూమి లేని కేసీఆర్.. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో, తెలంగాణ వచ్చిన తర్వాతే భూములను కొనుగోలు చేసినట్టు అఫిడవిట్ల ద్వారా తేలింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో 2010 సెప్టెంబర్ 21న 5.35 ఎకరాల (సర్వే నెం. 353/ ఏ, ఏఏ, ఈ, 350/ఈ/4, 360/ఈ/4)తో కొనుగోళ్లు మొదలయ్యాయి. ఆ మరుసటి రోజు మరో 15.30 ఎకరాలు కొన్నారు. 2013లో మూడు, 2014లో రెండు, 2015లో రెండు, 2016లో రెండు, 2017లో ఒకటి, 2018లో రెండు, 2023లో ఒకటి చొప్పున వరుసగా వ్యవసాయ భూములను ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల్లో కొనుగోలు చేశారు. వ్యవసాయ భూముల కొనుగోళ్లు 2010 తర్వాతే మొదలయ్యాయి. అప్పటి వరకు కేసీఆర్‌‌కు వ్యవసాయ భూమి లేదని అఫిడవిట్ ద్వారా వెల్లడైంది.

భూముల విలువ రూ.కోటిన్నర

ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2004, 2009 జనరల్ ఎలక్షన్స్‌లో కరీంనగర్, మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన టైమ్‌లో కూడా కేసీఆర్‌ దగ్గర ఒక్క గుంట కూడా వ్యవసాయ భూమి లేదు. ఈ రెండు ఎన్నికల అఫిడవిట్లలో ఆ అంశాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాతే ఒక్కొక్కటిగా వ్యవసాయ భూములు సమకూరాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన టైమ్‌లో మొత్తం 53.30 ఎకరాల సాగు భూములు ఉన్నట్టు అఫిడవిట్‌లో కేసీఆర్ పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.1.35 కోట్లుగా ప్రస్తావించారు.

కానీ ఎర్రవల్లి గ్రామస్తుల లెక్క ప్రకారం కేసీఆర్‌‌కు దాదాపు వంద ఎకరాలకు పైగానే ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమం సమయంలో టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వందల ఎకరాల భూములు ఉన్నట్లు స్వయంగా కేసీఆర్ తెలిపారు. కేసీఆర్‌ భూస్వామ్య కుటుంబంలో పుట్టారని, రాజకీయాల్లోకి రాకముందే వేల ఎకరాల భూములు ఉన్నాయని హరీశ్‌రావు సైతం చెప్పారు. కేటీఆర్ ఇదే విషయాన్ని గురువారం వెల్లడించారు. కానీ ఎలక్షన్ అఫిడవిట్‌లో సాగు భూమి లేనట్లుగా చెప్పడం గమనార్హం.

అధికారంలోకి వచ్చాకే 21 ఎకరాలు కొనుగోలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చాక దాదాపు 21 ఎకరాల వ్యవసాయ భూమిని ఆయన కొనుగోలు చేశారు. ఇందులో శివారు వెంకటాపూర్ గ్రామంలో 2023 జూలై 19న కొన్న 10 ఎకరాలు కూడా ఉన్నది. కేసీఆర్ అఫిడవిట్లలో వెల్లడించిన భూములకు, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన లెక్కలకు చాలా తేడా ఉన్నది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూములపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో నిజమేంటో త్వరలో తేలిపోనుంది.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఎంక్వయిరీ ప్రారంభించింది. రికార్డులను పరిశీలించడానికి రెవెన్యూ శాఖ అదనపు డైరెక్టర్, ఆర్డీవో సహా మరికొందరు గురువారం మర్కూర్‌ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లారు. అసైన్డ్ భూములు ఏ స్థితిలో ఉన్నాయో సర్వేయర్లు ఒకట్రెండు రోజుల్లో లెక్కలు తీయనున్నారు. అసైన్డ్ భూముల కేటగిరీలోని 388 ఎకరాల్లో ఎంత సక్రమంగా ఉన్నది? ఎంత కబ్జాకు గురైంది? దాన్ని ఎవరు కబ్జా చేశారు?.. ఇలాంటివన్నీ సర్వేలో తేలనున్నాయి. కేసీఆర్ అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారమే భూములు ఉన్నాయా? లేదంటే ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది తేలితే.. అది మరో చర్చకు దారితీయనున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>