ప్రజా రంజకంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన: జితేందర్ రెడ్డి

కలం, జోగులాంబ గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజా రంజక పాలన సాగిస్తున్నట్లు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఏపీ జితేందర్ రెడ్డి (Jithender Reddy) తెలిపారు. గురువారం జోగులాంబ గద్వాల కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం (Praja Palana Dinotsavam) నిర్వహించగా.. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గాంధీజీ, అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై జితేందర్ రెడ్డి ప్రసంగించారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 3.36 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని.. మహిళలకు రూ.129.03 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇప్పటి వరకు రూ.53.29 కోట్లతో 18,431 మందికి వైద్య సేవలు అందించామన్నారు. జిల్లాలో 58,113 రైతులకు రూ.513.99 కోట్ల పంట రుణమాఫీ చేశామన్నారు.

రాష్ట్రంలో అయిదో స్థానంలో జిల్లా..

గద్వాల జిల్లాలో 2026-27 వానాకాలం సీజనులో 1,72,417 మంది రైతులకు రూ.263 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయబోతున్నట్లు జితేందర్ రెడ్డి (Jithender Reddy) వివరించారు. వివిధ పథకాల అమలులో ఉత్తమ పని తీరుతో జిల్లా రాష్ట్రంలో అయిదో స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1,89,757 స్మార్ట్ రేషన్ కార్డులు అందించామన్నారు. మొదటి దశలో నిరుపేదలకు నియోజక వర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. జిల్లాలో 6,795 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 649 పూర్తయినట్లు తెలిపారు.

జిల్లాలో ఇప్పటివరకు జిల్లాలో 95,754 మందికి రూ.19.98 కోట్ల గ్యాస్ సబ్సిడీ అందించామన్నారు. 66,548 మంది లబ్దిదారులకు ప్రతి నెలా రూ.16.23 కోట్ల పెన్షన్లు పంపిణీ జరుగుతుందన్నారు. గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 868 స్వయం సహాయక సంఘాలకు రూ.92.88 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలులో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఇప్పటివరకు 827 మంది లబ్ధిదారులకు రూ.1.65 కోట్ల ఆర్థిక సహాయం అందించామన్నారు.

శరవేగంగా ప్రాజెక్టులు నిర్మాణం..

నెట్టెంపాడు (Nettempadu) ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచబోతున్నట్లు జితేందర్ రెడ్డి వివరించారు. భూసేకరణకు రూ.165 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గట్టు ఎత్తిపోతల ప్రాజెక్ట్ సామార్థ్యాన్ని 1.3 టీఎంసీల నుంచి 3.0 టీఎంసీలకు పెంచుతూ రూ.1,781 కోట్లతో ప్రాజెక్ట్ రీ-డిజైన్ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా హామ్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.339.39 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు.

రూ.128 కోట్లతో మెడికల్ కాలేజీ..

గద్వాల మెడికల్ కళాశాల అకడమిక్ బ్లాక్, వసతి గృహాల నిర్మాణానికి రూ.128 కోట్ల నిధులు మంజూరు కాగా, పనులు ప్రారంభమయ్యాయని జితేందర్ రెడ్డి తెలిపారు. గద్వాల పట్టణంలో రూ. 34.20 కోట్ల నిధులతో నర్సింగ్ కళాశాల భవనాలు, రూ.23.75 కోట్ల నిధులతో క్రిటికల్ కేర్ యూనిట్ భవనాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. గద్వాలలో నూతనంగా ఆర్డీవో, రెండు నియోజకవర్గాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవన నిర్మాణాలతో పాటు కేటీ దొడ్డి, ఉండవెల్లి, రాజోలి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల భవనాలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిందని చెప్పారు.

120 మంది విద్యా వలంటీర్ల నియామకం..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో అదనంగా 120 మంది విద్యా వలంటీర్లను నియమించామని జితేందర్ రెడ్డి వివరించారు. జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్, రెండు నియోజవర్గాలలో తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ మంజూరైనట్లు తెలిపారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సరిత, వాల్మీకి బోయ కార్పొరేషన్ ఛైర్మన్ గట్టు తిమ్మప్ప, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, గద్వాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ జయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో మంజుల పాల్గొన్నారు.

Also Read : చరిత్ర మరిచినా చెరగని వీరుడు.. రాంజీ గోండు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>