అస్తిత్వ పోరాట ప్రతీక తెలంగాణ.. ప్రజాపాలన వేడుకల్లో మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ అంటే కేవలం భౌగోళిక ప్రాంతం కాదని, అది అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం” వేడుకల్లో మంత్రి అడ్లూరి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు కరీంనగర్ లోని అమరవీరుల స్థూపం వద్ద చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ చిత్ర మిశ్రాతో పాటు కరీంనగర్ సీపీ గౌష్ ఆలంతో కలిసి వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు.

పోరాటాల ఫలితంగానే తెలంగాణకు విముక్తి..

సాయుధ రైతాంగ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు సాగిన పోరాటాల ఫలితంగానే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజాం పాలన నుండి తెలంగాణకు విముక్తి లభించిందని మంత్రి అడ్లూరి (Adluri Laxman Kumar) గుర్తుచేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిని వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా జిల్లా మహిళలు రూ. 383.56 కోట్ల లబ్ధి పొందారని (8.38 కోట్ల ప్రయాణాలు) చెప్పారు. 1.58 లక్షల మంది లబ్ధిదారులకు 11.93 లక్షల సిలిండర్లు పంపిణీ చేయగా, ప్రభుత్వం రూ. 39.44 కోట్ల సబ్సిడీ అందించిందని పేర్కొన్నారు.

మొదటి విడతలో 10,969 ఇండ్లు..

200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 1.73 లక్షల సర్వీసులకు గాను ప్రభుత్వం రూ. 190 కోట్లు చెల్లించిందని మంత్రి అడ్లూరి తెలిపారు. రైతుభరోసా కింద రూ. 206.82 కోట్లు, సన్నరకం ధాన్యం బోనస్ కింద రూ. 71.17 కోట్లు జమ చేశామని, ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో 10,969 ఇండ్లు మంజూరు కాగా లబ్ధిదారులకు రూ. 222 కోట్లు విడుదల చేశారని, రూ. 2 లక్షల ఆర్థిక సాయంతో ఇంటి పైకప్పు మార్చుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

47,798 కొత్త రేషన్ కార్డులు మంజూరు..

1.30 లక్షల మందికి ప్రత్యామ్నాయ చేయూత పింఛన్లు, 47,798 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు, నెలకు 6,063 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని మంత్రి వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 72.50 కోట్లతో 25,088 మందికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించామని, చొప్పదండిలో 100 పడకల ఆస్పత్రి, కొత్తపల్లిలో నర్సింగ్ కళాశాల భవనాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. వివాదరహిత గ్రామాల కోసం భూముల రీసర్వే చేపట్టామని, ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో 4,290 పెండింగ్ ఫైళ్లను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తున్న అందరికీ మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>