కలం, జనగామ: తనపై భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన భూ ఆరోపణలు అసత్యమని ఆయన ఖండించారు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన సందర్భంగా జనగామ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తాము వారసత్వంగా వచ్చిన ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశామని, భూ కబ్జాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. భూ ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో భూముల అంశంపై చర్చకు రావాలని సవాల్ చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు. ఆధారాలు లేకుండా తనపై, బీఆర్‌ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

