కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాట యోధులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నిజాం రాచరికం ముగిసి, ప్రజాస్వామ్యానికి మార్గం సుగమం చేసిన చారిత్రక రోజని, అందుకే దీనిని ‘ప్రజా పాలన దినోత్సవం(Praja Palana Dinotsavam)’గా జరుపుకుంటున్నామని తెలిపారు.
వ్యవసాయం, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం స్పష్టం చేశారు. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని, సన్న వడ్ల రకానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. గడిచిన 32 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేశామని, భూ పరిపాలనలో ‘భూ భారతి(Bhu Bharati)’ చట్టం ద్వారా సమగ్ర సంస్కరణలు తెచ్చామని వెల్లడించారు.
మహిళా సాధికారత దిశగా ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో మహిళలకు రూ.12,385 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. ‘గృహజ్యోతి’ కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
సామాజిక న్యాయం, సంక్షేమం విషయానికి వస్తే, కుల సర్వే ఆధారంగా స్థానిక సంస్థలు, విద్య, ఉపాధిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణను అమలు చేశామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ నిర్మిస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని వివరించారు. అలాగే గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు.
ఉపాధి, శిక్షణ రంగాలలో ఇప్పటికే 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశామని, యువతలో సాంకేతిక నైపుణ్యాల పెంపు కోసం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.
రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం (Revanth Reddy) ప్రకటించారు. 30,000 ఎకరాల్లో భారత్ మొదటి నెట్-జీరో స్మార్ట్ సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో టీసీఎస్ (TCS) సంస్థ రూ.70,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని చెప్పారు.
Also Read : అర్బన్ ల్యాండ్ సీలింగ్‌కు కొత్త విధానం
Follow Us On : WhatsApp

