కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ (Urban Land Ceiling) భూముల క్రమబద్ధీకరణకు త్వరలో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. 22-ఏ అంశంపై అసెంబ్లీలో ఆయన సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ప్రభుత్వం గుర్తించిన 12 అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎల్బీనగర్‌లో జీవో 118 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని, తద్వారా సుమారు 9,500 మంది బాధితులకు ఉపశమనం లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్ల తరబడి అక్కడే నివసిస్తున్న వారికి త్వరలోనే పరిష్కారం చూపిస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వ భూముల్లోని లేఔట్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తామని, సికింద్రాబాద్ పరిధిలో ఫ్రీహోల్డ్, భూదాన్ భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
హైపవర్ కమిటీ నియామకం
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. 22-ఏ సమస్యల్లో 12 అంశాలను గుర్తించినట్లు తెలిపారు. వీటి పరిష్కారానికి హైపవర్ కమిటీని నియమిస్తామని ప్రకటించారు. 22-ఏ జాబితాలో ఏయే భూములను చేర్చాలనే దానిపై నిర్దేశిత విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 22-ఏ జాబితాలో ఏదైనా భూమిని చేర్చే అధికారం ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లకు ఉంటుందని వివరించారు. సర్వే నంబర్, పట్టాదారు వివరాలను స్పష్టంగా గుర్తించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఏదైనా భూమిని నిషేధిత జాబితాలో చేర్చే ముందు ఈ-కేవైసీ చేయాల్సి ఉంటుందని సీఎం వివరించారు. ఇందు కోసం భూ యజమానులకు ఈ-మెయిల్ ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు. అభ్యంతరాలు తెలిపేందుకు 15 రోజుల సమయం ఇస్తామని, మొత్తం ప్రక్రియను రికార్డు చేస్తామని చెప్పారు. దేవాదాయ, వక్ఫ్ భూములను చట్ట ప్రకారం కొనుగోలు చేసిన సందర్భాల్లో వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని సీఎం తెలిపారు.
సీఎం పేర్కొన్న పన్నెండు అంశాలు ఇవే :
1. పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీల్లోని యూఎల్సీ మిగులు భూముల క్రమబద్ధీకరణకు కొత్త విధానం తీసుకొస్తారు. పాత, కొత్త దరఖాస్తులన్నింటికీ ఇది వర్తిస్తుంది. రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలను ఏకకాలంలో చేపడతారు.
2. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ ఆమోదించిన లేఔట్‌లలో పెండింగ్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులను పరిష్కరించేందుకు వారం రోజుల్లో సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఆస్తుల క్రమబద్ధీకరణకు నూతన పథకం తీసుకొస్తారు.
3. సింగరేణి బొగ్గు గని ప్రాంతాల భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేస్తారు. పెండింగ్ దరఖాస్తులను అర్హతల ఆధారంగా కమిటీ పరిష్కరిస్తుంది.
4. జీవో 59 కింద కన్వెయన్స్ డీడ్స్ జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను తుది పరిశీలన చేసి పరిష్కరించేందుకు కమిటీని నియమిస్తారు. మిగిలిన 18,590 పెండింగ్ దరఖాస్తులను కొత్త క్రమబద్ధీకరణ విధానంలో పరిష్కరిస్తారు.
5. ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీవో 118 కింద ఉన్న పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరిస్తారు. పరిష్కరించిన కేసులను వెంటనే 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు.
6. అసైన్డ్ భూముల్లో నిర్మించిన ఇళ్లు 1977 అసైన్డ్ భూముల (బదిలీ నిషేధ) చట్టం పరిధిలోకి వస్తున్నందున, సమగ్ర న్యాయ సమీక్ష, విస్తృత సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటారు.
7. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశంపై విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటారు.
8. లబ్ధిదారుల సొంత స్థలాల్లో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత క్రయవిక్రయాలకు అనుమతి ఇస్తారు.
9. ప్రైవేటు పట్టా భూముల్లో నాలా రుసుము చెల్లించని వాటికి నాలా ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు చెల్లించే విధంగా క్రయవిక్రయాలకు అనుమతిస్తారు.
10. ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలు, అనధికార లేఔట్లు, కాలనీలను నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకొస్తారు.
11. సికింద్రాబాద్ పరిధిలోని లీజ్‌హోల్డ్ ఆస్తుల ఫ్రీహోల్డ్ క్రమబద్ధీకరణ కేసులను పరిష్కరించేందుకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. వీటిని 30 రోజుల నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరిస్తారు.
12. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్మెంట్ భూములు, భూదాన్ భూములను సమగ్ర ల్యాండ్ పూలింగ్ విధానం పరిధిలోకి తీసుకొస్తారు. నిరుపేదలు, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి భూమి, నిధులు సమీకరిస్తారు. ఈ నిధులను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నిరుపేద లబ్ధిదారుల గృహ నిర్మాణానికి వినియోగిస్తారు.

