కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తులుగా ఎదిగిన గులాబీ దళం, నేడు తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి మళ్లీ పుంజుకుంటుందని ఆశించిన శ్రేణులకు క్షేత్రస్థాయిలో వరుసగా ఎదురవుతున్న పరిణామాలు తీవ్ర నైరాశ్యాన్ని కలిగిస్తున్నాయి. నియోజకవర్గాల్లో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు, దానికి తోడు అధిష్ఠానం చూపిస్తున్న ఉదాసీన వైఖరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ (Khammam BRS) ఉనికినే సవాలు చేస్తున్నాయి.
ఇన్ఛార్జీలు లేరు.. సమన్వయం అసలే లేదు..!
జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాథుడే కరువయ్యాడు. గత ఎన్నికల్లో భద్రాచలంలో మాత్రమే గెలిచినప్పటికీ, ఆ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరడం, మరోవైపు వైరాలో కీలక నేత మదన్‌లాల్ అకాల మరణంతో ఆ రెండు నియోజకవర్గాల్లో నాయకత్వ శూన్యత ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో పార్టీని బలోపేతం చేయాల్సిన చోట, అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావుల మధ్య మొదలైన ‘టికెట్ పోరు’ ద్వితీయ శ్రేణి నేతలకు మింగుడుపడటం లేదు.
ఒకే పార్టీలో ఉంటూ ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వేర్వేరు సమావేశాలు నిర్వహిస్తుండటంతో కేడర్ రెండు వర్గాలుగా చీలిపోతోంది. ఇక కొత్తగూడెంలో ప్రస్తుతం ఉన్న ఇన్‌ఛార్జ్‌పై అసంతృప్తి నెలకొనడంతో పాటు మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంబీకులు, ఇతర ఆశావహులు వేర్వేరుగా పావులు కదుపుతున్నారు. ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ సైలెంట్ అయిపోవడం, మధిరలో సమన్వయ లోపం ఉండటంతో నాయకులను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక అధిష్ఠానానికి పెద్ద పరీక్షగా మారింది.
కాంగ్రెస్ జోరు… వామపక్షాల తోడు!
ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలకు గాను 9 అసెంబ్లీ స్థానాలను చేజిక్కించుకుని అత్యంత బలంగా దూసుకుపోతోంది. మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల రూపంలో ముగ్గురు కీలక మంత్రులు ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నిధుల మంజూరు, అభివృద్ది పనులతో ప్రజాదరణను నిలబెట్టుకుంటోంది. దీనికితోడు ఖమ్మం జిల్లాలో మొదటినుంచీ బలమైన పునాదులున్న సిపిఐ, కాంగ్రెస్‌తో కలిసి నడుస్తుండటంతో ఆ కూటమికి తిరుగులేని బలం చేకూరింది.
రుణమాఫీ, 22A నిషేధిత భూముల వివాదాలు, సీతారామ ప్రాజెక్టు ఆలస్యం వంటి అంశాలపై గులాబీ నేతలు అక్కడక్కడా నిరసనలు తెలుపుతున్నప్పటికీ, స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడంతో క్యాడర్లో ఉత్సాహం నీరుగారిపోతోంది. త్వరలోనే స్థానిక సంస్థల సమరం ఎదురవుతున్న తరుణంలో అధిష్ఠానం ఇప్పటికైనా మేల్కొని వివాదాస్పద ప్రాంతాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించి, అంతర్గత విభేదాలను సరిదిద్దకపోతే… ఉమ్మడి ఖమ్మం ఖిల్లాలో బిఆర్ఎస్ ఉనికి మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

